టిప్పర్ల అతివేగం, ఓవర్ లోడ్..
బస్సును ఢకొీన్న టిప్పర్ బ్యాతోల్ క్వారీ నుంచి వెళ్లిందే..
మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు
కంకర క్వారీల టిప్పర్ల ప్రమాదాల్లో అమాయకులు బలి
వాహనాల తనిఖీలు చేయని ఆర్టీఏ అధికారులు
ఆ ప్రమాదంతో మేలుకున్న ఆర్టీఏ అధికారులు
తనిఖీలో 14 టిప్పర్లు సీజ్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కంకర క్వారీల నుంచి మైనింగ్ వ్యాపారులు లాభాలే ధ్యేయంగా టిప్పర్లకు ఓవర్ లోడ్ చేసి యథేచ్ఛగా తిప్పుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని లక్డారం, బ్యాతోల్, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో మైనింగ్ మాఫీయా విచ్చల విడిగా బరితెగిస్తోంది. ఒక్కో టిప్పర్ సామర్థ్యం 30 టన్నులు ఉండగా, వారు ఏకంగా 60 టన్నుల వరకు కంకర, డస్ట్‌ను ఓవర్ లోడ్ చేసి తరలిస్తున్నారు. ఈ అధిక లోడు వల్ల టిప్పర్ యజమానులకు రెట్టింపు ఆదాయం సమకూర డంతోపాటు డీజిల్, లేబర్ ఖర్చులు కలిసి వస్తున్నాయి. వేబిల్లు ప్రకారం అనుమతించిన బరువుతో సరఫరా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ, రెండు ట్రిప్పుల్లో వెళ్లాల్సిన లోడ్‌ను నిబంధనలను తుంగలో తొక్కి ఒక ట్రిప్పులోనే నింపి తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతోంది. ఇదే సమయంలో హడావిడిగా టిప్పర్లను నడిపిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.
అధికంగా లోడ్ చేసి అధికారుల కంట పడకుండా వెళ్లాలని టిప్పర్ల డ్రైవర్లను యజమానులు ఆదేశించడంతో విపరీతమైన వేగంతో దూసుకుపోతూ తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. టిప్పర్లతో వరుసగా జరుగుతున్న ప్రమాదాలను నివారించాల్సిన ఆర్టీఏ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పటాన్‌చెరు రూరల్ పరిధిలోని లక్డారంలో భారీగా క్రషర్లను ఏర్పాటు చేసేందుకు మైనింగ్ మాఫియా ప్రజాభిప్రాయ సేకరణలను సైతం తప్పుదోవ పట్టించింది. తమకు అనుకూలంగా ఉన్న ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపి క్రషర్లను ఏర్పాటు చేశారు. దీనికంతటికీ మైనింగ్ అధికారులు క్వారీల యజమానులతో కుమ్మక్కై వారిచ్చే ముడుపులకు ఆశపడి పర్యవేక్షించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
గతంలో జరిగిన ప్రమాదాలు..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై గండిపేట వైపు వెళ్తున్న భిక్షపతి కారును జూన్ 9వ తేదీన పాటి సమీపంలో టిప్పరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షపతి కుమార్తె వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందారు. భిక్షపతి, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. సదాశివ పేటకు చెందిన గిరి మార్చి 21న వనస్థలిపురం వెళ్లేందుకు కారులో వెళుతూ ఓఆర్‌ఆర్ పైకి ఎక్కాడు. టిప్పరు ఢీకొనడంతో మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
2020లో మార్చిలోనూ లక్డారం గ్రామానికి చెందిన మాదన్నగారి వెంకటరామిరెడ్డి(25) బైక్‌పై వెళ్తుండగా టిప్పర్ ఢీకొనడంతో అక్కడి కక్కడే మృతిచెందాడు. ఇదే గ్రామానికి చెందిన రామిరెడ్డి(30) కూడా గతంలో టిప్పర్ ఢీ కొనడంతోనే ప్రాణం కోల్పోయాడు. ఇలా లక్డారం చౌరస్తా, 65వ నంబర్ జాతీయ రహదారి, ఔటర్‌పై జరిగిన టిప్పర్ ప్రమాదాల్లో అమాయక ప్రజలు అసువులు బాసిన సంఘటనలు అనేకం. తాజాగా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 20 మంది మృతికి కారణమైన టిప్పర్ కూడా సంగారెడ్డి జిల్లా లక్షారం సమీప గ్రామం బ్యాతోల్ నుంచే వెళ్లిందన్న సంగతి స్థానికులను తీవ్ర కలవరపాటుకు గురి చేసింది.
మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం ఎల్కపల్లి, బండపోసాన్పల్లిలో, మాసాయిపేట మండలం రామాంతపూర్, తూప్రాన్ మండలం ఘనపూర్‌లో మూడు, కొల్చారం మండలం రాంపూర్లో కంకర క్యారీలు ఉన్నాయి. రెండేండ్ల కిందట దీపావళి టపానుల కోసం హౌంగార్డ్ భార్య తన ఇద్దరు చిన్నారు లతో స్కూటీపై వెళుతుండగా మెదక్ కేర్ ఆస్పత్రి ఎదురుగా వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో వారంతా మృతి చెందారు. గతేడాది మెదక్ రాందాస్ చౌరస్తా సిగల్ వద్ద పాదచారిని టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందారు. బాలానగర్- బోధన్ జాతీయ రహదారి మెదక్ పట్టణం మీదుగా వెళ్తుండటంతో మెదక్ రోడ్ గుండా భారీ వాహనాలు వందలాదిగా ప్రయాణిస్తున్నాయి. పట్టణానికి బైపాస్ రోడ్డు లేక ప్రమాదాలు అధికమయ్యాయి.
ప్రమాదంతో మేలుకున్న ఆర్టీఏ అధికారులు
చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో ఆర్టీఏ అధికారులు మేలుకున్నారు. పటాన్‌చెరు ప్రాంతంలో తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని 14 టిప్పర్లను సీజ్ చేశారు. లక్డారం, బ్యాతోల్ క్వారీల నుంచి కంకర, డస్ట్ తరలిస్తున్న వాహనాలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.
బ్యాతోల్ క్వారీ అధిక లోడ్ టిప్పర్‌తోనే బస్సు ప్రమాదం
చేవెళ్ల పరిధి మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లక్డారం సమీపంలోని బ్యాతోల్‌లో ఉన్న ఎస్‌ఎంఎస్ క్వారీ ోనే లోడ్ అయింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే టిప్పర్లన్నీ తెల్లవారుజామునే బయలుదేరు తాయి. ఉదయం 5గంటలకు టిప్పర్లు క్వారీల నుంచి బయలుదేరి అధికారులు విధులకు రాకముందే తాము చేరాల్సిన గమ్యస్థానాలకు చేరుకుంటాయి. మీర్జాగూడ వద్ద టిప్పర్ అధిక లోడ్ ఉండటమే కాకుండా డ్రైవర్ అజాగ్రత్త గా.. అతివేగంతోపాటు నడపడంతో మూల ములపు వద్ద వేగం కంట్రోల్ కాక ఆర్టీసీ బస్సును ఎదురుగా వెళ్లి ఢీకొన్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. క్వారీల నుంచి టిప్పర్లలో కంకర, డస్ట్ తరలిస్తే పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలి.
పరిమితికి మించి టిప్పర్‌లో లోడ్ నింపరాదు. కానీ అధికలోడ్‌తోపాటు కవర్లు కప్పకుండా.. అజాగ్రత్తగా నడుపుతూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీటిని పట్టించుకోవాల్సిన ఆర్టీఏ, మైనింగ్ శాఖలు నిమ్మకునీరేత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం భారీ స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో లక్డారం ప్రాంతం నుంచి వందలాది వాహనాల్లో నిత్యం తరలివెళ్తున్న కంకర, డస్ట్ లోడుతో కూడిన టిప్పర్లు(డంపర్లు) రహదారులపై మృత్యు శకటాల్లా దూసుకుపోతున్నాయి. అతివేగం, అజాగ్రత్త, ఓవర్ లోడ్‌తో నడుస్తున్న ఈ టిప్పర్ల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఆయా కుటుంబాలు రోడ్డున పడి, ఆర్థికంగా, మానసికంగా చితికిపోతున్నాయి.
దుమ్ముధూళితో నిత్యం ప్రమాదాలే..
సంగారెడ్డి జిల్లాలో అధిక లోడ్‌తో వెళ్తున్న భారీ వాహనాలతో దుమ్ము ధూళితోపాటు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 131 క్వారీలు, 178 క్రషర్ల ద్వారా వేలాది వాహనాల ద్వారా రోజుకు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు కంకర, రాతిపొడి, చిప్ను తరలిస్తున్నార న్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాల్లో అధిక లోడ్‌తో తరలించడం వల్ల అనేక ప్రమాదాలు జరి గాయి. రోడ్లు పాడవుతున్నాయి. విచ్చలవిడిగా తిరుగు తున్న భారీ వాహనాలపై అధికారులు చర్య లు తీసుకుని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు



