తాతకు దగ్గులు నేర్పాననుకునే ‘విశ్వగురు’ పాలనలో భారత ప్రతిష్టను ‘దగ్గు మందులు’ దిగజారుస్తున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. తాజాగా దగ్గు సిరప్ కాటుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పద్నాలుగుమంది చిన్నారులు కడతేరిపోవడం దేశవ్యాప్తంగా కలవరం సృష్టిస్తోంది. అంతకుముందు జమ్మూలో పన్నెండు మంది పిల్లలను పొట్టనపెట్టుకున్న దగ్గు టానిక్ దేశీయంగా నాసి, నకిలీ మందుల ఉత్పాతాన్ని కండ్లకు కట్టింది. వాస్తవానికి వ్యాధులను నయంచేసి రోగులకు త్వరగా సాంత్వన కల్పించాల్సిన మందుల్లో కల్తీలపై కథనాలెన్నో వస్తునే ఉన్నాయి. కానీ, సత్తాచూపలేని ఔషధ నియంత్రణ విభాగాల పుణ్యమా అని విచ్చలవిడిగా సాగుతున్న ఈ దందాలు ప్రజారోగ్యాన్ని బలి తీసుకుంటూనే ఉన్నాయి. ఆరోగ్య రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించిందంటూ ఒక వైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలు బాకా బజాయిస్తుంటే… మరోవైపు ”భారత్ ఫార్మా కంపెనీలో తయారైన దగ్గు మందులతో ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త” అంటూ గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డప్పుడే డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు జారీచేసింది. అయినా మనం పాఠాలు నేర్చింది లేదు.
ఎడతెరిపి లేని దగ్గు ప్రాణాలు తీస్తుందేమో అని తాగించిన మందే విషమై తన పిల్లల ప్రాణాలు తీస్తుంటేే ఆ తల్లిదండ్రులు చేష్టలుడిగి చూస్తూ ఉండటం ఎంత నరకయాతన! ఈ ఘటన పిల్లలకు దగ్గుమందు వాడాలంటేనే తల్లిదండ్రుల్లో వణుకు పుట్టిస్తుంది. మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో పదకొండుమంది చిన్నారులు ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు టానిక్ తీసుకున్న కారణంగా చనిపోయారు. ఇటు రాజస్థాన్‌లోనూ మూడు మరణాలు సంభవించాయి. తీవ్రజ్వరం, పొట్ట ఉబ్బిపోయి.. మూత్రపిండాలు(కిడ్నీ) ఫెయిలై మరణించారు. ఈ తరహా లక్షణాలతో మరో ఎనిమిది మంది చిన్నారులు నాగ్‌పూర్, భోపాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చిన్న చిన్న ఫార్మా కంపెనీలు… ఎన్నో మందులు తయారు చేసి అమ్ముతున్నాయి. పెద్ద కంపెనీలతో పోటీపడలేక అడ్డదారులు తొక్కుతున్నాయి. మందులపై ఎక్కువ ఎమ్మార్పీ ముద్రించి… అతి తక్కువ ధరకే మందుల షాపులకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తున్నాయి. వైద్యులకు అడ్డగోలు కమీషన్లు ఆశచూపి.. పేషెంట్లకు తమ మందులే రాసేలా ప్రలోభపెడుతున్నాయి. ఇటు వైద్యులకు, అటు మందుల షాపులకు బోలెడు లాభం.. ఇంతదాకా బాగానే ఉంది. కానీ అతి తక్కువ ధరకు మందులు, ఆపై కమీషన్లు ఇస్తూ, తాను కూడా లాభం పొం దాలంటే..ఆ ఫార్మా కంపెనీ మందుల తయారీలో నాణ్యతను ఆశించడం అత్యాశే అవుతుంది. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఘటనలే అందుకు రుజువు. మధ్యప్రదేశ్‌లో చిన్నారుల ఉసురుతీసిన సిరప్‌లో విషపూరిత రసాయనం పరిమితికి మించి ఉంది. రాజస్థాన్‌లో పసికందులకు వాడకూడని దగ్గు మందును ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అందించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దానికితోడు లోగడ నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో సంబంధిత ఔషధ నమూనాలు విఫలమయ్యాయి. సర్కారీ యంత్రాంగం తన విధి నిర్వహణలో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇప్పుడు ఈ అనర్థం జరిగిఉండేది కాదు. ఇప్పటికైనా కేంద్రం సరైన రీతిలో స్పందించకుంటే మన దేశంలో కోట్లమంది చిన్నారుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
మన దేశంలో లభించే ఔషధాల్లో 25 శాతం నకిలీవేనని అనేక ఘటనలు రుజువుచేస్తునే ఉన్నాయి. విస్తృత స్థాయిలో ఔషధ నాణ్యతా పరీక్షలకు తగినంత మౌలిక వసతులు ఇక్కడ లేవు. తనిఖీ చేయాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లూ లేరు. దాంతో శాంపిళ్ల సేకరణ అరకొరగానే ఉంటోంది. మరోవైపు ఔషధశాలల నిర్వాహకు లతో అధికారగణాల అవినీతి అనుబంధాలు బహిరంగ రహస్యాలే! ఇవన్నీ నేరగాళ్లకు అయాచిత వరాలుగా మారుతున్నాయి. నిత్యం అంతుచిక్కని వ్యాధులు, కొత్తకొత్త రోగాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికి పోటీగా నకిలీ పార్మా కంపెనీలు వెలుస్తున్నాయి. ఈ సమయంలో కల్తీ మందుల కట్టడిలో ఉదాసీనంగా వ్యవహరిస్తే దేశ పురోగతే ప్రమాదంలో పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ నకి’లీల’లకు అడ్డు కట్టవేయాలి.
ఫార్మా సామ్రాజ్యాన్ని ప్రభుత్వాలు కదిలించలేనంత బలంగా తయారైంది. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు ప్రోత్సహించిన ఫలితం ఇప్పుడందరూ అనుభవించాల్సి వస్తోంది. బ్రిక్స్ దేశాల్లో ప్రజారోగ్యానికి అతి తక్కువ ఖర్చు పెడుతున్నది మన దేశమేన న్నది జగమెరిగిన సత్యం. ప్రజారోగ్య సంరక్షణ విషయంలో భారత్‌కు లభించిన 147వ స్థానం ”భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించడం” అన్న విశ్వగురు వ్యాఖ్యలు ఒట్టి మాటలేనని తెటతెల్లం చేస్తుంది.
మరణ ”సిరప్”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES