వడ్డీ రేట్లు మరింత తగ్గొచ్చు
పీహెచ్‌డిసీసీఐ అంచనా
న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ) రుణ సవాళ్లను ఎదుర్కొంటుందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (పీహెచ్‌డీసీసీఐ) సెక్రెటరీ జనరల్, సీఈఓ రంజిత్ మెహతా పేర్కొన్నారు. ఎస్‌ఎంఈ మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అందుబాటు రేట్లలో రుణాలు, టెక్నాలజీ, మార్కెట్ అవకాశాల పరంగా సమస్యలు చవి చూస్తున్నాయన్నారు. ఈ అంశాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో విడత వడ్డీ రేట్లను తగ్గించొచ్చని తెలిపారు. సమీప కాలంలోనే రేట్ల కోత ఉండొచ్చన్నారు. జూన్ 4 నుంచి 6 మధ్య జరగనున్న ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షా జరగనుంది. ఇందులో మరోమారు వడ్డీ రేట్ల తగ్గుదలపై ఆశలు, అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేండ్ల కనిష్టానికి పడిపోయింది. సాధారణంగా అల్ప స్థాయిలో ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు జీడీపీ వృద్ధికి మద్దతును అందిస్తాయి. దీంతో ప్రజల వద్ద ఆదాయాలు పెరగడంతో కొనుగోళ్లకు మద్దతు లభించనుంది. ద్రవ్యోల్బణం ఆధారంగానే ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును పావు శాతం చొప్పున మొత్తం అర శాతం తగ్గించింది. ఫలితంగా ఎట్టకేలకు రెపో రేటు 6 శాతానికి దిగివచ్చింది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించడానికి వీలుందని ఎస్బీఐ రీసెర్చ్ ఇటీవల పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే వడ్డీ రేట్లను 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడానికి వీలుందని పేర్కొంది. జూన్-ఆగస్టు సమయంలో 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల తగ్గింపును అంచనా వేసింది. ద్వితీయార్థంలో మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించడానికి వీలుందని పేర్కొంది.
ఎంఎస్‌ఎంఈలకు రుణ సవాళ్లు
- Advertisement -
- Advertisement -