– కాగ్ నివేదిక ఇదే చెప్పింది : మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
అమరావతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, వాటి వివరాలను చట్టసభకు తెలియనీయకుండా చేస్తున్నారని మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2023-24తో పోలిస్తే 2024-25 నాటికి రెవెన్యూలోటు 56 శాతం, ద్రవ్యలోటు 30 శాతం పెరిగిందని తెలిపారు. సూపర్ సిక్స్ అమలు చేయలేదని, పాత స్కీములను రద్దు చేశారని పేర్కొన్నారు. ఖర్చుల కోసం అప్పులమీద ఆధారపడుతున్నారని అన్నారు. జిఎస్‌డిపిలో ద్రవ్యలోటు 5.08 శాతానికి పెరిగిందని అన్నారు. నెట్ బారోయింగ్ సీలింగ్‌ను ప్రతిసారీ ఉల్లంఘిస్తున్నారని, గతేడాది పరిమితికి మించి రూ.17,953 కోట్లు అప్పులు చేశారని అన్నారు. విశాఖపట్నంలో రూ.5 వేల కోట్ల విలువైన భూములను కారుచవకగా కట్టబెట్టారన్నారు. ఖజానా లో మినిమం బ్యాలెన్స్ నగదు నిల్వ ఏడాదికి ఎనిమిది రోజులు మాత్రమే ఉందని చెప్పారు. గత బడ్జెట్లో రూ.60,485 కోట్లు అప్పులు చేశామని తెలిపారని, కాగ్ మాత్రం రూ.81,071 కోట్లు అప్పులని తేల్చి చెప్పిందన్నారు. ఇతర అప్పులు చేయలేదని మండలిలో రాతపూర్వకంగా ఇచ్చారని, మరి కాగ్ నివేదిక ఎలా పేర్కొందని ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై డిఒపిటికి ఫిర్యాదు చేస్తామని జగన్ తెలిపారు. సిఎం, మంత్రి లోకేష్, డిప్యూటీ సిఎం ఒకరికొకరు ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. నిరుద్యోగ భృతిపై 16 రోజుల అసెంబ్లీలో కనీసం చర్చించలేదని, ఆడబిడ్డనిధి ప్రస్తావన లేదని పేర్కొన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు ఇస్తామని చెప్పారని, ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 5.64 లక్షల పెన్షన్లు తగ్గించారని, బడ్జెట్ కేటాయింపుల్లోనూ భారీగా కోతపెట్టారని అన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.36 వేలకోట్ల బెనిఫిట్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తల్లికి వందనంలోనూ ఇష్టం వచ్చిన వారికి ఇష్టం వచ్చినట్లు జమ చేశారన్నారు. దీపం పథకానికి ఇప్పటి వరకూ రూ.6,143 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఇవి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించినా సమాధానం లేదని పేర్కొన్నారు. మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయని తెలిపారు. మిర్చి క్వింటా రూ.26 వేల నుంచి రూ.18 వేలుకు తగ్గిందని పేర్కొన్నారు. మొక్కజొన్న ఎంఎస్‌ఎపి రూ.2,400 ఉంటే రైతుకు రూ.1,400 నుండి రూ.1,500 మాత్రమే వస్తోందని చెప్పారు. పాలు, నీరు ఏది తాగినా చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటున్న చంద్రబాబు, వారిపై దారుణాలకు పాల్పడ్డ తెలుగుదేశం నాయకులను ఏమి చేశారో చెప్పాలన్నారు. ఆడవాళ్లు, దేవుడంటే గౌరవం లేని వ్యక్తికి టిటిడి ఛైర్మన్ పదవి ఇచ్చారని తెలిపారు. తిరుమల నెయ్యిలో రూ.200 కోట్లకుపైబడి అక్రమాలు జరిగాయన్నారు. తిరుమల పరకామణి నుండి కోటి రూపాయల విలువైన బంగారం దొంగిలిస్తే బయటకు రానీయలేదని అన్నారు.
అప్పులే ఆధారం
- Advertisement -
- Advertisement -



