Sunday, July 27, 2025
E-PAPER
Homeఅంతరంగందశాబ్ది ఉత్సవాలు

దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ… మరో నాలుగు రోజుల్లో పదో వసంతంలోకి అడుగిడబోతోంది. ‘పత్రికొక్కటున్న చాలు పదివేల సైన్యంబు’ అంటారు నార్లవారు. ఈ మాటలను నవతెలంగాణ అక్షరాలా నిజం చేస్తోంది. 2015లో పత్రిక ఏర్పడిన నాటి నుండి ఈ దశాబ్ది కాలంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రజలపక్షం నిలబడింది. మీడియారంగాన మార్కెట్‌ శక్తుల విజృంభణ పాత్రికేయ వృత్తిలోని పవిత్రతకీ, నైతికతకీ పెనుసవాల్‌గా మారిన పరిస్థితులలో నిజాయితీకి, అంకిత భావానికి పట్టం కడుతోంది. కర్తవ్యదీక్షకు నిబద్ధులై పని చేసే పత్రిక సిబ్బంది నవతెలంగాణకు కొండంత అండగా ఉంటే, సామాజిక అంశాలపై తమ కలాలను కదిలించి వ్యాసాలు, కథలు, కవితలు పంపుతున్న రచయితలు వెన్నుదన్నుగా నిలిచారు. ఇలా అందరి సహకారంతోనే నవతెలంగాణ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. అందరి ఆదరాభిమానాలతో ఆగస్టు 1 నుండి 31 వరకు దశాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతోంది.
కార్పొరేట్ల కబంధ హస్తాల్లో మీడియా ఉన్న ఈ తరుణంలో ప్రజాపక్షం వహిస్తూ, ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటన్నిటినీ అధిగమిస్తూ ఓ పత్రిక ముందుకు సాగడం సాధారణ విషయం కాదు. అకుంఠిత దీక్షతో అన్నింటినీ అధిగమించి ముందుకు నడిచింది. ఆటంకాలకు తలవంచక, లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టక తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అణచివేతకు గురయ్యేవారి గొంతుకగా నిలిచింది. ప్రజల ఆలోచనలను వినిపిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. నిజాలను నిర్భయంగా చెప్పడం తన బాధ్యతగా భావించింది.
సమాజాన్ని మతం పేరిట, కులం పేరిట చీల్చుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ దేశంలో పాలన సాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా నిబద్దతతో పోరాడే శక్తులకు ఒక వేదికగా నవతెలంగాణ నిలిచింది. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడంలో ముందుంది. ప్రశ్నించే వారి అభిప్రాయాలను ప్రతిఫలించే శక్తివంతమైన కూడికగా నవతెలంగాణ ఉంది. కులదురహంకారాలను, ఆధిపత్య సంస్కృతులను ఎండగట్టడంలో ముందుభాగాన నిలిచింది. నిత్యం సమస్యతో పోరాడుతున్న రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలకు అండగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచింది.
అవని.. ఆకాశంగా చెప్పుకుంటున్న ఆమెపై సాగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నిస్తుంది. ‘మానవి’గా మహిళల స్ఫూర్తిదాయక జీవితాలను పాఠకులకు పరిచయం చేస్తోంది. సామాజిక, సాంస్తృతిక, ఆర్థిక అవగాహన కల్పిస్తూనే వినోదం, ఆహ్లాదాన్ని పంచుతూ ప్రతి ఆదివారం ‘సోపతి’గా ప్రజల ముందుకు వస్తుంది. సాహిత్యంలో భిన్న కోణాలను స్పృశిస్తూ ప్రతి సోమవారం ‘దర్వాజ’ సాహిత్యాభిమానుల గుమ్మం ముందు ప్రత్యక్షమవుతుంది. అనుదినం.. జనస్వరంతో ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. కష్టజీవుల పోరాటాలకు అవసరమైన సమాచారం అందిస్తోంది. ప్రజాశక్తి వారసత్వంతో ముందుకు నడుస్తోంది. కేవలం ఒక పత్రికగానే కాక ఓ ఉద్యమంగా సాగుతోంది.
పాలకులు కాలాలకు సంకెళ్లు వేస్తున్నా ప్రజల కోసం నికార్సుగా నిలబడుతున్న పత్రిక నవతెలంగాణ. భయాలకు లొంగిపోకుండా ధైర్యంగా తన కలాన్ని కదిలిస్తోంది. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను పాఠకలోకానికి చేరవేసేందుకు విశేష కృషి చేస్తోంది. అగ్రకుల ఆధిపత్య సంస్కృతిని, భూస్వామ్య భావాలను ప్రపంచానికి చాటి చెబుతూ పదో వసంతంలోకి అడుగుపెడుతున్న శుభసమయాన రచయితలకు, పాఠకులకు అభినందనలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -