Tuesday, November 18, 2025
E-PAPER
Homeజాతీయంనాలుగు వారాల్లో తేల్చండి

నాలుగు వారాల్లో తేల్చండి

- Advertisement -

చర్యలు తీసుకుంటారా? కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటారా?
కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్‌ నిర్ణయించుకోవాలి
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
వాది, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సీజేఐ ధర్మాసనం
తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న 10 మందిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్పీకర్‌ చర్యలు తీసుకుంటారా? లేక కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆయన ఇష్టమని వ్యాఖ్యానించింది. ఫైనల్‌గా కొత్త సంవత్సరం వేడుకల్ని స్పీకర్‌ ఎక్కడ జరుపుకోవాలో(జైల్‌ లోనా… బయటా) నిర్ణయించకోవాలని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌ గవారు హెచ్చరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై వీలైనంత త్వరగా లేదంటే మూడు నెలల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జులై 31న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబర్‌ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ అధికారాలు, హైదరాబాద్‌లో వరదలు, రోజువారీ కార్యక్రమాలు, స్పీకర్ల అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు.. ఇటువంటి కార్యాక్రమాల్లో స్పీకర్‌ బిజీగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యంకాలేదని గత నెల 25న స్పీకర్‌ కార్యాలయం సుప్రీంకోర్టులో మిస్‌లీనియస్‌ అప్లికేషన్‌ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు సైతం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అకాల వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యలు తదితర కారణాలతో నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోందని, అందువల్ల మరో ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని కోరింది.
అయితే స్పీకర్‌.. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఉద్దేశ పూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని, అందువల్ల స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్‌, అలాగే, ఆ పదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేటీఆర్‌ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను కలిపి సోమవారం సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌ గవారు నేతృత్వంలోని జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

స్పీకర్‌ అనర్హత పిటిషన్లు ముగించాలనే ఉద్దేశం లేదు…: అడ్వొకేట్‌ ఆర్యమ సుందరం
తొలుత… ఈ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ బెంచ్‌ ముందుకు రాగా… సీనియర్‌ అడ్వొకేట్లు ఇతర బెంచ్‌ల ముందు వాదనలు కొనసాగిస్తున్నందున తెలంగాణ ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రవణ్‌ పాస్‌ ఓవర్‌ కోరారు. ఇందుకు సీజేఐ అనుమతించడంతో… మరికొద్ది సేపటి తర్వాత ఈ పిటిషన్‌ మరోసారి బెంచ్‌ ముందుకు వచ్చింది. ఈ సందర్భంలోనూ శ్రవణ్‌ ఎండ్‌ ఆఫ్‌ ది బోర్డు( రోజు వారి చివరి కేసుగా) వినాలని కోరారు. ఇందుకు సీజేఐ నిరాకరించారు. ఒకసారి పాస్‌ ఓవర్‌ ఇచ్చామని గుర్తు చేశారు. రెండు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలన్నారు. మరోవైపు శ్రవణ్‌ వాదనలు కొనసాగిస్తూ… నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేసినట్టు నివేదించారు. ఈ వాదనలతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ.. ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై రోజువారీగా విచారణ జరపాలని గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు గుర్తు చేశారు. మధ్యలో కేటీఆర్‌, పాడి కౌశిక్‌, ఇతరుల తరపు సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం జోక్యం చేసుకొని, స్పీకర్‌ ఈ తీర్పును సైతం మూడు వారాలకు ముందు రిజర్వ్‌ చేసినట్టు కోర్టుకు తెలిపారు. మరో నలుగురికి సంబంధించి ఆధారాలు సమర్పించినా విచారణ తేదీలు ఇవ్వలేదన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌ నోటీసులకు కనీసం కౌంటర్‌ అఫిడవిట్‌ కూడా దాఖలు చేయలేదని నివేదించారు. స్పీకర్‌కు ఈ అర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన లేదని, అందువల్ల కోర్టు ధిక్కర నోటీసులు ఇవ్వాలని అభ్యర్థించారు.

నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో ఆయనే తెల్చుకోవాలి : సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయి
విచారణ జరగుతుందడగానే…. ప్రభుత్వం, స్పీకర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గి, అభిషేక్‌ మను సింఘ్వీలు కోర్టు హాల్‌కు చేరుకున్నారు. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ… ఫిరాయింపు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విచారణ కోసం మరో ఎనిమిది వారాల టైం ఇవ్వాలని కోరుతూ అప్లికేషన్‌ దాఖలు చేసినట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ”మరో ఎనిమిది, తొమ్మిది వారాలు సమయం అవసరం. ఇప్పటి వరకు ఈ కేసులో 20 మంచి నిర్ణయాలు తీసుకున్నాం” అని వాదించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ… ”రోజు వారీగా ఈ విచారణ పూర్తి చేయాలని గత ఆదేశాల్లో స్పష్టంగా చెప్పాం. ఎవరైనా ఎమ్మెల్యే విచారణను పొడగించాలని చూస్తే వేటు వేయాలని ఆదేశించాం” అని గుర్తు చేశారు. ”ఎమ్మెల్యేల అనర్హత పై చర్యలు తీసుకుంటారా? కోర్టు ధిక్కారాన్ని ఎదుకుర్కోంటారా? అనేది ఆయన (స్పీకర్‌) నిర్ణయం. పదో షెడ్యూల్‌ కింద ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకునేటప్పుడు స్పీకర్‌కు రాజ్యాంగపరమైన అంశాల్లో వెసులుబాటు లేదని గత తీర్పుతో స్పష్టం చేశాం. ఇక ఆయన నూతన సంవత్సర వేడుకల్ని ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ధారించుకోవాలి” అని వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సింఘ్వీ బదులిస్తూ హైదరాబాద్‌ లో వరదల కారణంగా 10 రోజులు ఆలస్యం అయిందన్నారు.

అందువల్ల మరో ఎనిమిది వారాలు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సీజేఐ ఉత్తర్వులు వెలువరించేందుకు సిద్ధం కాగా… మధ్యలో సీనియర్‌ న్యాయవాది రోహిత్గి జోక్యం చేసుకొని కనీసం నాలుగు వారాలు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం… వాది, ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్‌పై విచారణ ముగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది. కాగా… ఈ కేసు విచారణ వచ్చే నెల 19న కోర్టు ముందుకు వచ్చే ఆస్కారం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -