Friday, October 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు3వ తేదీ తర్వాతే స్థానికంపై నిర్ణయం

3వ తేదీ తర్వాతే స్థానికంపై నిర్ణయం

- Advertisement -

ఆ రోజు హైకోర్టులో వాదనలు..7న మళ్లీ మంత్రివర్గ సమావేశం
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు కొనసాగింపు
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతపై ఆర్డినెన్స్‌
యుద్ధప్రాతిపదికన 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికలపై నవంబర్‌ 3వ తేదీ హైకోర్టులో వాదనలు ఉన్నందున, అవి పూర్తయ్యాకే దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రమంత్రివర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఆ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు తెలిపారు. ఈనెల 7వ తేదీ మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దానిలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అలాగే శ్రీశైలం నుంచి ఫ్లోరైడ్‌ ప్రాంతమైన నల్గొండకు గ్రావిటీ ద్వారా టన్నెల నుంచి తాగు నీరు తెచ్చేందుకు 44 కి.మీ., ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌కు అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ టన్నెల్‌ నిర్మాణం దాదాపు 32 కి.మీ., పూర్తయ్యిందనీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధి లేనందున కేవలం 2.5 కి.మీ., పనుల మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తు సొరంగ ప్రమాదం జరిగి, 11 మంది మరణించారని చెప్పారు.

పలు సమీక్షల అనంతరం ఆ ప్రాజెక్ట్‌ పనులను అదే ఏజెన్సీ ద్వారా పూర్తిచేసి, 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంనాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని వివరించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థికభారం పడబోదని స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు తెలంగాణ పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాల సవరణ చేసి, దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించామన్నారు. ఎల్‌బీ నగర్‌, సనత్‌నగర్‌, వరంగల్‌, అల్వాల్‌ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కూడా మంత్రివర్గ ఆమోదం లభించింది. రామగుండం థర్మల్‌ స్టేషన్‌లో 62.5 మెగావాట్ల పాత ప్లాంట్‌ కూల్చివేతకు మంత్రివర్గం ఆమదోం తెలిపిందన్నారు. అలాగే వచ్చే పదేండ్లకు సరిపడేలా సోలార్‌, బ్యాటరీ, రివర్స్‌పంపింగ్‌ ప్రతిపాదనల్ని వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -