ఐటీడీఏ, ఐబీ శాఖలు కొత్త భవనాలకు మార్పు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పరిపాలనా మార్పులు, పట్టణీకరణ వేగవంతం కావడంతో అశ్వారావుపేట లో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందించిన అనేక పురాతన ప్రభుత్వ కార్యాలయాలు త్వరలో తరలిపోనున్నాయి. నియోజకవర్గ కేంద్రం మున్సిపాల్టీ గా రూపాంతరం చెందిన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మాణానికి ప్రభుత్వం అవసరమైన భూములను కేటాయించింది. మున్సిపాల్టీ నూతన కార్యాలయ నిర్మాణం కోసం పూర్వ మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా, నీటిపారుదల సబ్ డివిజనల్ కార్యాలయం స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి వినియోగించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ మార్పుల నేపథ్యంలో రెండు కీలక శాఖలు తమ కార్యాలయాలను కొత్త ప్రాంగణాలు కు మార్చేందుకు సిద్ధమయ్యాయి. ఐటీడీఏ డివిజనల్ కార్యాలయం – గుర్రాల చెరువు వద్ద నిర్మితమైన పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులు నిర్ణయించారు.
- ఐబీ (నీటిపారుదల శాఖ ) కార్యాలయం
- పేరాయిగూడెం పంచాయితీ కార్యాలయ భవనానికి తరలించేందుకు అధికారులు అంగీకరించారు. స్థానిక శాఖాధికారులు కార్యాలయాల మార్పు విషయాన్ని సమ్మతిస్తూ అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలకు సేవలందించిన ఈ కార్యాలయాలు ఇప్పుడు కొత్త ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.
అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా జరగుతున్న ఈ తరలింపు, భవిష్యత్తులో సౌకర్యవంతమైన పరిపాలనకు దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, పాత కార్యాలయాలు కనుమరుగు అవడం స్థానికుల్లో కొంత భావోద్వేగాన్ని కూడా రేకెత్తిస్తోంది.



