Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబిల్లులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి

బిల్లులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి

- Advertisement -

గవర్నర్లకు మూడు నెలల కాలపరిమితి చాలా ఎక్కువ సుప్రీంకోర్టుకు మూడు ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు వెల్లడి

న్యూఢిల్లీ : గవర్నర్లకు క్లియరెన్స్‌ కోసం పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. బిల్లుల ఆమోదం కోసం ఏప్రిల్‌లో న్యాయస్థానం విధించిన మూడు నెలల కాలపరిమితి కూడా చాలా ఎక్కువేనని వివరించాయి. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌ మిశ్రా, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ పి.ఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఎ.ఎస్‌ చందుర్కార్‌లతో కూడిన ధర్మాసనానికి వాదనలు వినిపించాయి. కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పరిపాలిస్తున్న విషయం విదితమే.
బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించటంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే. అసలు రాష్ట్రపతికి గడువు నిర్దేశించే అధికారం న్యాయస్థానాలకు ఉన్నదా? అని ప్రశ్నిస్తూ.. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టుకు ముర్ము సూచించారు. దీంతో రాష్ట్రపతి రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు సీజేఐ బి.ఆర్‌ గవాయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ రిఫరెన్స్‌పై న్యాయస్థానం కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు జులైలో నోటీసులు జారీ చేసింది. అయితే రాష్ట్రపతి రిఫరెన్స్‌పై జరిగిన విచారణ సందర్భంగా ఈ మూడు రాష్ట్రాలూ తమ వాదనలను వినిపించాయి. ప్రజల అభీష్టాన్ని గవర్నర్ల ఇష్టాయిష్టాల బలిపీఠానికి వదిలేయలేమని స్పష్టం చేశాయి. గవర్నర్‌ వంటి ఉన్నత రాజ్యాంగ అధికారం బిల్లులను ఆమోదించే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరి స్తుందని రాష్ట్రా లు భావించాలని కేంద్రం కోరుకుంటే.. అదే మర్యాదను ఉన్నత రాజ్యాంగ అధికారం కలిగిన శాసన సభలకూ విస్తరించాలని మూడు రాష్ట్రాలు కోరాయి.

బిల్లుల చట్టబద్ధతను పరిశీలించే అధికారం గవర్నర్‌కు లేదు : పశ్చిమ బెంగాల్‌
సుప్రీంకోర్టు విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లుల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధతను పరిశీలించే, ప్రశ్నించే అధికారం గవర్నర్‌కు, కేంద్రానికి లేదని చెప్పారు. ఒక చట్టం రాజ్యాంగబ్ధతలను పరీక్షించాల్సింది న్యాయస్థానాలే అని వివరించారు. శాసన నిర్మాణంలో పార్లమెంటుకు ఉన్న అధికారాలే రాష్ట్ర అసెంబ్లీలకూ ఉంటాయని కపిల్‌ సిబల్‌ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌ ఒక బిల్లుతో విభేదిస్తే..వీలైనంత త్వరగా రాష్ట్ర శాసన సభకు తిరిగి పంపాలని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా అంటే ‘వెంటనే’ అని అర్థం వస్తుందనీ, దీనిని గవర్నర్లు, రాష్ట్రపతికి వర్తించాలని చెప్పారు.

కేంద్రం వాదన లోపభూయిష్టం..
కోర్టులే తుది మధ్యవర్తులు : కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌

అలాగే కర్నాటక తరఫున గోపాల్‌ సుబ్రమణ్యం, హిమాచల్‌ప్రదేశ్‌ తరఫున న్యాయవాది ఆనంద్‌ శర్మలు వాదించారు. రాష్ట్ర శాసన సభలు తమ శాసనాధికారాలపై దాడికి అనుమతించవని సుబ్రమణ్యం చెప్పారు. రాష్ట్రపతి, గవర్నర్లకు విస్తృత విచక్షణాధికారాలు ఉన్నాయనే కేంద్రం వాదన ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నదని వాదించారు. రాజ్యాంగం విషయానికొస్తే.. కోర్టులే తుది మధ్యవర్తులనీ, అదే గణతంత్ర బలమని ఆనంద్‌ శర్మ కోర్టు తెలిపారు. బిల్లుల ఆమోదానికి గడువు విధించటంపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరటాన్ని వీరు వ్యతిరేకించారు. కాగా ఈ వివాదంపై తదుపరి విచారణ ఈనెల 9న మొదలవుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad