– గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు
– 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటూ భ్రమ : అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
– కేంద్రం నుంచి నిధులు తేవాలి : పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆ ప్రసంగంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. అది హామీల ఎగవేత డిక్లరేషన్‌లా ఉందని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ఆయన మాట్లాడుతూ హామీల అమలు, సమస్యల పరిష్కారం, అప్పులు ఎలా అధిగమించాలో ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉందన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పలో ఉంటే 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ భ్రమలు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్‌ఆర్ ట్యాక్స్‌తో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. సకాలంలో రైతుభరోసా ఇవ్వడం లేదని చెప్పారు. యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కౌలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతుభరోసా ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ కాంగ్రెస్‌కు ఎవెన్యూగా మారిందని చెప్పారు. సాదాబైనామాలు పరిష్కారం కాలేదన్నారు. భూమి కబ్జాలకు గురవుతున్నదని ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో నిలువుదోపిడీ జరుగుతున్నదనీ, ఫీజు కట్టినా ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదనీ, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కల్పించుకుని రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది ఎమ్మెల్యేలున్నారని చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్‌లో తెలంగాణ అంతర్భాగం కాదా?అని ప్రశ్నించారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి టీచర్లకు జీతాలు ఎక్కువంటూ నివేదిక ఇచ్చారని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లకు ప్రతినెలా జీతాలు రావడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు, మందుల్లేవు, సదుపాయాల్లేవని అన్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో 42 శాతం బీసీ మంత్రులున్నారా?అని ప్రశ్నించారు. సామాన్యుల ఇండ్లు కూలగొడుతున్నారని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కల్పించుకుని గుజరాత్‌లో సబర్మతి ప్రాజెక్టుకు ఒక న్యాయం, మూసీ ప్రక్షాళనకు మరో న్యాయమా?అని ప్రశ్నించారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సబర్మతికి ప్రజలు స్వచ్చంధంగా స్థలాలిచ్చారని అన్నారు. ఇక్కడ పరిహారం ఇవ్వకుండా, ముందస్తు నోటీసులివ్వకుండా బుల్డొజర్లతో ఇండ్లు కూల్చివేస్తున్నారని చెప్పారు. 65 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం ఆరు సార్లయినా ప్రజావాణికి వెళ్లారా?అని ప్రశ్నించారు. ఆటోడ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ గేయానికి అసెంబ్లీలో జరిగిన అవమానంపై స్పీకర్ సుమోటోగా తీసుకుని ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందేమాతరం గీతాన్ని అవమానించడం దేశద్రోహమని అన్నారు.
హామీల ఎగవేత డిక్లరేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



