నేనెందుకు అరవాలి?
నాకు గొంతు ఉందని నాకైనా తెలియాలి.
నేనెందుకు నడవాలి?
నాకు కాళ్లున్నాయని నాకైనా తెలియాలి.
నేనెందుకు నిరసన ప్రకటించాలి?
నాకు ఆ స్వేచ్ఛ ఇంకా మిగిలి ఉందని
నాకైనా తెలియాలి.
నేనెందుకు పోరాడాలి?
నాకు ఆ బాధ్యత ఉందని నాకైనా తెలియాలి.
వ్యవసాయ, రక్షణ, రవాణా, రైల్వే, హమాలీ,
అంగన్వాడీ, ఆశా, బీమా, బ్యాంకింగ్, ఫార్మా.,
సంఘటిత, అసంఘటిత రంగాలన్నీ!
ఏ రంగంలో చూసినా ఏమున్నది గర్వకారణం!
అన్నింటిలో ఒకే లక్షణం!
అది వేదనా భరిత ఉత్పాతం!!
తగులుకుంటోంది
కణ కణంలో ఇక రణం!!
ఇది రణ నినాద కదన రంగం!
అయితే…
నిజమైన యుద్ధం ఎవరెవరికి మధ్య?
ఆకలికి, కడుపు నిండినతనానికి!
గృహ వసతి లేమికి,
ఇంద్ర భవంతుల బలిమికి!
సరిపడా కనీస వేతనం కూడా లేని పనికీ,
తరతరాలు కూర్చొని తిన్నా,
ఇంకా మిగిలి ఉండే
ఖజానా భాండాగారానికి!
కనీస నిరసన కూడా తెలుపలేని
కోడ్ తాళాల బందీలకు,
పురుడు పోసుకోక ముందే
నిర్దాక్షిణ్య అణచివేతతో..
చిదిమి వేసే రాజ్య, యాజమాన్య
దుర్మార్గ నియంతృత్వాలకు!
ఇది సరైన సమీక్షా కాలం.
నన్ను నేను పరీక్షించుకునే కాలం.
నేనెటు వైపు?
దోపిడీ వైపా?పోరాటం వైపా?
కళ్లలో రక్తాలు పిండించే వైపా?
కన్నీళ్లు తుడిచే వైపా?
వివక్ష వైపా?సమానత్వ సమూహం వైపా?
కొద్దిపాటి పిడికెడు మంది
పీడక బేహారుల లాభాపేక్ష వైపా?
త్యాగాల పునాదులపైశ్రమ,
చెమట, నెత్తురుతో
సంపద భవనాలను నిర్మించే
ప్రపంచ కార్మికుల వైపా?
ఇప్పుడు అన్ని కళ్ళూ
చికాగో హే మార్కెట్ వైపే…
స్పూర్తి కోసం మళ్లీ మళ్లీ చూస్తున్నాయి.
ఆశగా వెతుకుతున్నాయి.
పదండి పదండి మిత్రులారా!
ఇంకెంతో దూరం లేదు
మన స్వప్న ప్రపంచం.
సాకారమయ్యే ముందు
నిదుర కన్నులు రుద్దుకొని,
రెండు చేతులూ గట్టిగా విదిల్చి,
ఒక చేతిలో అరుణ పతాకం,
మరో చేతిలో బిగించిన
పిడికిలి ఆయుధాలుగా..
పదపద..వడివడిగా..సడిసడి చేస్తూ
ఒక్కొక్కరు వందలుగా, వందలు వేలుగా,
వేలు లక్షలుగా, లక్షలు కోట్లుగా..
ఒక్కటై సాగుదామా?
త్యాగాల నేపథ్య సంగీతానికి
సరైన తాళంలో కవాతు చేద్దాం! నర్తిద్దాం!
ప్రజా సమూహాన్ని ఒక గొప్ప సజీవ ఆశల
వాస్తవ తీరానికి చేరుద్దాం!!
మేడే వర్ధిల్లాలి!
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి!!
- గిరిధర్, 9849801947