Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో క్షీణించిన ప్రగతి

హైదరాబాద్‌లో క్షీణించిన ప్రగతి

- Advertisement -

– రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఫ్యూచర్‌ సిటీ : హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ సమీక్షలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుప్పకూల్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. రెండేండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో ప్రగతి క్షీణించిందని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నగర నేతలతో కేటీఆర్‌ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి, అక్రమాలు, స్కాంల వల్లే హైదరాబాద్‌కు ఈ పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్యం నుంచి ప్రజా రవాణా దాకా అన్ని రంగాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పారిశ్రామిక ప్రగతి నుంచి వ్యాపార వాణిజ్యాలు అన్నీ నగరంలో క్షీణించాయని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. ఉన్న నగరాన్ని వదిలిపెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఫోర్త్‌ సిటీ, ఫ్యూచర్‌ సిటీని ఆయన ప్రమోట్‌ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ నగర ప్రజల అంశాలను, ప్రభుత్వ పక్షపాత వైఖరిని అన్ని విధాలుగా ఎండగడతామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల కోసం మాత్రమే రేవంత్‌రెడ్డి పరిపాలన చేస్తున్నాడని అన్నారు. హైదరాబాద్‌లో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో నగరాన్ని పతనావస్థకు చేరుస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం రూ.వేల కోట్లను రాష్ట్ర రాజధాని నుంచి దోచుకోవడానికి ‘హైడ్రా’ నుంచి మొదలుకుని పారిశ్రామిక భూముల స్కాం, టీడీఆర్‌ పేరిట మరో స్కాం, ఇలా ఫోర్త్‌ సిటీ భూముల కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. హైదరాబాద్‌లో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం నెలకొన్నదనీ, నగరంలో కరెంట్‌ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు దర్శనమిస్తున్నాయని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో తిరోగమనంలోకి తీసుకెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల కోసం, పార్టీ కార్యక్రమాలను, నాయకులకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం కోసం జీహెచ్‌ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ కోసం ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలకు కేటీఆర్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు, నగర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -