Sunday, May 25, 2025
Homeప్రత్యేకంతెలుగుకి తగ్గుతున్నగౌరవం!

తెలుగుకి తగ్గుతున్నగౌరవం!

- Advertisement -

‘మన భాష మనం మాట్లాడుకుందాం. మన మట్టికి గౌరవం తెచ్చుకుందాం’ అనే నినాదం ఇప్పటికీ నినాదంగానే మిగిలిపోతోంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాష దుస్థితి గమనార్హమైన అంశంగా మారింది. శాసనాల స్థాయిలో ఉన్నత అభిప్రాయాలు ప్రకటించినా, అమలులో మాత్రం పరాజయం చవిచూస్తున్నాం.
తెలుగు భాషకు ఎందుకు అవమానం జరగడానికి కారణం వలసభాషల ప్రభావం. ఇంగ్లీషు, హిందీ భాషలు విద్యా వ్యవస్థలో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, తెలుగు భాషను రెండవ భాషగా కూడా కొందరు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం కార్పోరేట్‌ శక్తుల పెట్టుబడిగా విద్య మారడం. దీనికి ప్రభుత్వాలు సహకరించడం. తెలంగాణలో ప్రైవేట్‌ పాఠశాలలో తెలుగు మాట్లాడితే పిల్లలకు ఫైన్‌. దానితోపాటు శారీరక శిక్షలు, విద్యార్థి ఇంకో విద్యార్థిని కొట్టడం ఎంతవరకు సమంజసం? రోజంతా తరగతి బయట నిలబెట్టడం, మీరు మాట్లాడేది భాష కాదు. తెలుగు ఒక భాషనా, ఇది నిరక్షరాస్యులు మాట్లాడే భాష అని హేళన చేయడం. ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల తీరును గమనిస్తే ఇది అందరికీ అర్థం అయితది. దీనికి తోడు తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడితే అవమానంగా భావించడం. విద్యార్థులను బలవంతంగా అర్థం కాని భాషలో చదివించడం. దీనికి కారణం ఎవరో మనందరికీ తెలుసు.
సామెత: ‘ఇల్లు ఉన్నా, ఊరంతా బడిసలే అయినట్టు’
తెలుగు మాతృ భూమిలోనే ఇతర భాషలకు అవకాశం ఉండటం బాధాకరం. ఇతర భాషలు ఉండడం సమస్య కాదు. ఇతర భాషలను గౌరవించుకుంటూ మన భాషను గౌరవించుకునే స్థాయిలో మన ఆలోచన, ఆచరణ ఉండాలని భావన.
రాజకీయ నిర్లక్ష్యం:
నిత్య జీవనంలోని పరిపాలనా వ్యవస్థలు, విద్య, ఉద్యోగ ప్రక్రియల్లో తెలుగుకు ప్రాధాన్యత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
‘స్వభాషే అభివద్ధి ద్వారం’. ఇది గుర్తించకుండా పాలకులు నడవటం మౌలిక నైతిక లోపం.
రెండవభాషగా తెలుగు తొలగింపు వాస్తవమా?
తాజా నివేదికల ప్రకారం, కొన్ని విద్యాసంస్థలు, ప్రైవేటు పాఠశాలలు తెలుగును రెండవ భాష నుంచి తొలగిస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇది భాషా హక్కుల ఉల్లంఘన.
‘తెలుగు లేకుంటే తెలుగువాడి గుర్తింపే లేదు!’ భాషా ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రంలో తెలుగు భాష లేకుంటే తెలుగువారికి గౌరవం ఎక్కడీ
విద్యా విధానాల రూపకల్పనలో స్థానిక భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం భవిష్యత్‌ తరాలకు భాషా బోధనలో లోటు తీసుకురాగలదు.
తెలుగు అమలు విషయంలో ఏం జరుగుతోంది?
ప్రభుత్వ స్థాయిలో:
ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయస్థానాల్లో, పాలన వ్యవస్థలో ఇంగ్లీషు భాష ఆధిపత్యంగా ఉండటం గమనార్హం.
‘ఊరంతా హిందీ మాట్లాడితే, మానవాళికి తెలుగే లేదనిపించేస్తున్నారు’
విద్యా వ్యవస్థలో:
మాతభాషలో బోధన, ఈ ఏడాది తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలు తగ్గిపోవడం వల్ల విద్యార్థుల లోతైన ఆలోచనా శక్తి, భావప్రకటన నైపుణ్యం తగ్గిపోతుంది.
‘భాషే జ్ఞానానికి వేదిక’ అమలు విషయంలో ఏం జరుగుతోంది?
సమస్యాత్మక పథాలు :
1. పాఠశాల స్థాయిలో తెలుగు మైనస్‌ అయిపోతోంది.అనేక ప్రైవేట్‌ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం లేకపోవడం గమనార్హం. విద్యార్థులు సాంస్కతిక స్థితిగతులను విస్మరిస్తున్నారు.
సామెత: ‘నిండిన కలశం మౌనంగా ఉంటుందా?’
2. తెలుగు పదవులతో ప్రభుత్వ ప్రకటనలు రావడంలేదు. ఉత్తర్వులు, గెజెట్లు, దరఖాస్తులు అన్నీ ఇంగ్లీషులో రావడం వల్ల సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేరు.
3. ఉద్యోగ నియామకాలలో భాష ప్రమాణాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు పరీక్షలు లేదా అర్హతలు లేకుండా నియామకాలు జరగడం భాష అభివద్ధికి ప్రమాదం.
4. చట్టసభలలో తెలుగు బదులుగా ఇతర భాషల వాడుతున్నారు. సభల్లో సభ్యులు తెలుగుకు బదులుగా ఇంగ్లీష్‌, హిందీ వాడటం విశ్లేషణను తప్పుదోవ పట్టిస్తోంది.
5. భాషా సంస్థల నిధులు, కార్యకలాపాలు శూన్యం. తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాల వంటి సంస్థలలో సజీవ కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి.
6. అధికారిక వెబ్‌సైట్లలో తెలుగు పరిమితిగా ఉంది. ప్రభుత్వ వెబ్‌సైట్లు చాలావరకు తెలుగు అనువాదం లేకుండా ఉంటున్నాయి.
7. వెబ్‌ మీడియా, మొబైల్‌ యాప్‌లలో తెలుగు మైనస్‌. మొబైల్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ సేవలలో తెలుగు అనువాదం లేనిదే సేవలు అందించడం వల్ల భాష అందుబాటులో లేదు.
8. బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బోర్డులు తెలుగులో లేవు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రకటనలలో తెలుగుకు ప్రాధాన్యం లేకపోవడం, స్థానికతకు అవమానం.
9. న్యాయ వ్యవస్థలో తెలుగు అవినీతి వలయం. న్యాయస్థానాల్లో తెలుగులో వాదనలు జరగకపోవడం వల్ల సామాన్యులకు న్యాయం నాకొద్దన్నట్లుగా మారింది.
10. తెలుగు పండుగలకు పట్టింపు తగ్గుతోంది. స్కూల్‌ సెలవుల్లో సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ వంటి పండుగల్ని పూర్తిగా గుర్తించడం లేదు
పరిష్కార మార్గాలు
1. తెలుగు భాషను ప్రథమ భాషగా తప్పనిసరిగా కేజీ టు పీజీ వరకు అమలు చేయాలి. అన్ని పాఠశాలల్లో, కళాశాలలో విశ్వవిద్యాలయాలలో తెలుగు మాధ్యమం చదవడం తప్పనిసరిగా ఉండాలి.
2. ప్రతి ఉద్యోగ నియామకంలో తెలుగు అర్హత పరీక్ష ఉండాలి. గ్రూప్‌ ఫోర్త్‌ నుండి ఐఏఎస్‌ వరకు తెలుగు పరీక్ష లేక ఉద్యోగమే లేదు!
3. సర్వత్రా తెలుగు లిపి వాడకం తప్పనిసరి చేయాలి. బోర్డులు, ప్రకటనలు, ఆఫీసు పేర్లలో తెలుగు తప్పనిసరైన భాషగా ఉండాలి.
4. ప్రభుత్వ నిబంధనలు, ప్రకటనలు తెలుగులో విడుదల చేయాలి.
5. తెలుగు మాధ్యమ విద్యాసంస్థలకు పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు ప్రోత్సాహం ఇవ్వాలి.
6. తెలుగు అకాడమీ, సాహిత్య సంస్థలకు విస్తత అధికారం, నిధులు ఇవ్వాలి.
7. ఇంటర్నెట్‌, మొబైల్‌ యాప్‌లలో తెలుగు మద్దతు తప్పనిసరి చేయాలి.
8. న్యాయస్థానాల్లో తెలుగు వాదనలకు అవకాశం కల్పించాలి. తెలుగు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుగులోనే వాదోపవాదాలు జరగాలి. న్యాయ పత్రాలు కూడా తెలుగులోనే ఇవ్వాలి.
9. ప్రతి ప్రభుత్వశాఖలో తెలుగు అనువాద విభాగం ఉండాలి. మండల స్థాయి నుండి సుప్రీంకోర్టు వరకు ప్రతి విభాగంలో తెలుగు అనువాదకులు ఉండాలి.
10. మళ్లీ తెలుగు పండిత శిక్షణ కళాశాలలు తిరిగి ప్రారంభించాలి.
11. ప్రాథమిక స్థాయిలో తెలుగు పండిత శిక్షణ పూర్తిచేసిన తెలుగు భాషా బోధకుడు చేత భాషా బోధన జరగాలి.
12. టెట్టు పరీక్షలో నష్టపోతున్న తెలుగు భాషోపాధ్యాయులు, తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తూ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ప్రత్యేకంగా తెలుగుకి 60 మార్కులు ఆంధ్రప్రదేశ్‌ లాగ తెలంగాణలో ప్రవేశపెట్టాలి. పేపర్‌-3 నిర్వహించాలి.
13. తెలంగాణలో ఉద్యోగ నియామక పరీక్షలో తెలుగును ప్రవేశపెట్టాలి.
14. తెలుగుమాధ్యంలో చదివిన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలి.
15. బీటెక్‌, ఎంటెక్‌, ఇంజనీరింగ్‌ కోర్సులలో విశ్వవిద్యాలయ కోర్సులలో తెలుగు భాషా నైపుణ్యాలు కోర్సును ప్రత్యేకించి చేర్చాలి.
ప్రజల్లో చైతన్యం కోసం ఉద్యమాలు, కొత్తగా చట్టాలను జీవోలను తీసుకురావాలి. భాషా సంఘాలు, భాషపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, జిల్లా విద్యాధికారులు, లెక్చరర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, విశ్వవిద్యాలయాల శాఖ అధిపతులు, రాజకీయ నాయకులు, తెలుగు భాషను పరిరక్షించడంలో వారి బాధ్యతగా వారి వారి స్థాయిలలో ఐక్యతగా కషి చేయాల్సిన అవసరం ఉంది.
ముగింపు:
తెలుగు తల్లి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. భాష అంటే పాఠశాల పుస్తకాల్లో ఉండే పదాలు కాదు. అది మన తల్లిమాట. గౌరవించని భాషను భవిష్యత్‌ గుర్తించదు. కావున తెలుగు రాష్ట్రాలు నిజంగా తెలుగువారి వాడలుగా నిలవాలంటే, ప్రతి ఒక్కరూ స్వభాషపై గౌరవం, గర్వం కలిగి ముందడుగు వేయాలి. ఇది ఆత్మగౌరవ పోరాటం.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీ కష్ణదేవరాయలు అన్న మాటలు నామమాత్రంగా కాక, నిత్య జీవితంలో వాడుకగా మారాలంటే మేల్కొని చైతన్యం తీసుకురావాలి. అవసరమైతే భాషా ఉద్యమం చేయాలి. ప్రభుత్వంతో సామరస్యంగా వెళుతూ ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేద్దాం!. కదులుదాం రండి నిత్య చైతన్యం నిరంతర ప్రయత్నంతో తెలుగు భాషను పరిరక్షించుకుందాం!
డా. తెల్జీరి గిరీశం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -