దమానీని వెనక్కి నెట్టిన జొమాటో చీఫ్
టాప్ 10 జాబితాలో ఇండిగో, స్విగ్గీ ఫౌండర్లు
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ హురున్ జాబితా వెల్లడి
హైదరాబాద్ : స్వయంకృషి సంపాదనలో జొమాటో మాతృసంస్థ ఎటెర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా ‘టాప్ 200 స్వయంకృషి ఔత్సాహికవేత్తలు 2025’ జాబితాలో డిమార్ట్ అధినేత రాధాక్రిష్ణన్ దమానిని వెనక్కి నెట్టి దీపిందర్ మొదటి స్థానంలోకి వచ్చారు. 25 సెప్టెంబర్ 2025 నాటికి సంపద ఆధారంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రయివేటు, హురున్ ఇండియా టాప్-200 వ్యాపారవేత్తల జాబితా- 2025ను బుధవారం విడుదల చేసింది. బిలియన్ డాలర్ల కంపెనీగా (దాదాపు రూ.9వేల కోట్లు) ఏర్పాటు చేసిన స్వయంకృషితో పైకొచ్చిన వ్యాపారవేత్తల సంఖ్య గతేడాది 121గా ఉంటే.. ఈ ఏడాది 128కి పెరిగింది. ఈ జాబితాలో చోటుదక్కించుకున్న వాటిలో 52 కంపెనీలు బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. జొమాటోకు చెందిన ఎటర్నెల్ రూ.3.2 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది.
ఏడాదిలో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీపిందర్ తొలిసారి స్థానం దక్కించుకోగా.. జొమాటో దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందిస్తోందని నివేదిక పేర్కొంది. పోటీ కంపెనీ స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. దమానీకి చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్ విలువ ఏడాదిలో 13 శాతం తగ్గి రూ.3లక్షల కోట్లకు పరిమితమయ్యింది. ఇటీవల తీవ్ర వివాదస్పద మైన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ హురున్ ఇండియా జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. స్వయంకృషిలో ఎదిగిన వ్యాపారవేత్తల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. వీరు నెలకొల్పిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ విలువ రూ.2.2 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ విమానయాన రంగంలో 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా ఉందని హురున్ పేర్కొంది. అధునాత పద్ధతులతో అంతర్జాతీయంగానూ విస్తరిస్తోందని తెలిపింది.
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్‌శర్మ ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. ఆయన వ్యాపార సంస్థ వన్ 97కమ్యూనికేషన్ మార్కెట్ విలువ రూ.72,800 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 67 శాతం మేర పెరిగింది. లెన్స్‌కార్ట్ సైతం 60 శాతం పెరుగుదలతో రూ.67 వేల కోట్ల మార్కెట్ విలువ సాధించగా.. ఈ కంపెనీ ఫౌండర్లు పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, నేహా బన్సల్, సుమిత్ కపాహీ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. హురున్ వెలువరించిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.42 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది రూ.36లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. దీంతో ఏడాది 15 శాతం విలువ పెరిగింది. నాలుగో స్థానం లో మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అభయ్ సోయి, ఐదో స్థానంలో స్వీగ్గీకి చెందిన శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి, ఆరోస్థానంలో మేక్‌మైట్రిప్ ఫౌండర్లు దీప్ కర్లా, రాజేశ్ మాగౌ, ఏడో స్థానంలో పాలసీ బజార్ వ్యవస్థాపకులు యాశిష్ దహియా, అలోక్ బన్సల్, ఎనిమిదో స్థానంలో పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, తొమ్మిదో స్థానంలో నైకా ఫౌండర్లు ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్ నిలిచారు.



