Sunday, January 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఓడిన అభ్యర్థి కుటుంబీకులపై ట్రాక్టర్‌తో దాడి

ఓడిన అభ్యర్థి కుటుంబీకులపై ట్రాక్టర్‌తో దాడి

- Advertisement -

– నలుగురికి గాయాలు
– ఇద్దరి పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు
– ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్‌లో ఘటన

నవతెలంగాణ-ఎల్లారెడ్డి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట్‌ గ్రామపంచాయతీలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి తమ్ముడు.. ఓడిపోయిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి చేశాడు. దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి.. సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి కురుమ పాపయ్య గెలిచాడు. అయితే, ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి బాలరాజు కుటుంబ సభ్యులపై రాజకీయ కక్షతో సర్పంచ్‌ తమ్ముడు సోమవారం దాడి చేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాలరాజు ఇంటి ఆవరణలో కూర్చున్న గంజి భారతి, తోట శారద, బాలమణి, సత్తెవ్వపై ట్రాక్టర్‌ను ఎక్కించే ప్రయత్నం చేశాడు. దాంతో నలుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఎల్లారెడ్డిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. భారతి, తోట శారద పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాలమణి, సత్తెవ్వను ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.

రాస్తారోకో..
ఈ ఘటనను నిరసిస్తూ సోమార్‌పేట్‌ గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎల్లారెడ్డి-నిజాంసాగర్‌ ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, ఆత్మకూర్‌ మాజీ జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాధ్యక్షులు ఆదిముల సతీష్‌, సోమార్‌పేట్‌ నాయకులు జనార్ధన్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు వెంటనే న్యాయం చేయాలని, దాడి చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి రాస్తారోకో చేస్తున్న నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకుండా బీష్మించుకూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అందించారు. దీంతో కేటీఆర్‌ జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా సురేందర్‌ మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే దాడి చేసినట్టు తెలిపారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా ఈ దాడికి పూర్తి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ సోమార్‌పేట్‌లో పోలిస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంట ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ మహేష్‌, ఎస్‌ఐ-2 సుబ్రహ్మణ్య చారి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -