Tuesday, December 16, 2025
E-PAPER
Homeజాతీయంపప్పు ధాన్యాల నిల్వ పద్ధతుల్లో లోపాలు

పప్పు ధాన్యాల నిల్వ పద్ధతుల్లో లోపాలు

- Advertisement -

దిగుబడులను హరిస్తున్న తేమ, ఉష్ణోగ్రత, పురుగుల దాడి
ఏకీకృత ప్రమాణాలు అవసరం
ఐసీఏఆర్‌- సీఐపీహెచ్‌ఈటీ అధ్యయనం


న్యూఢిల్లీ : దేశంలో పప్పు ధాన్యాలను నిల్వ చేస్తున్న పద్ధతులలో తీవ్ర లోపాలు ఉన్నాయని ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. దీంతో అత్యధిక జనాభాకు మాంసకృత్తులను అందజేస్తున్న పప్పుల లభ్యతపై ఆందోళన అధికమవుతోంది. పప్పుల్ని నిల్వ చేయడం, మర పట్టించడం వంటి విషయాలలో ఏకీకృత శాస్త్రీయ ప్రొటోకాల్స్‌ అవసరమున్నదని సర్వే నొక్కి చెప్పింది. పప్పు ధాన్యాలను అధికంగా పండిస్తున్న రాష్ట్రాలలోని 101 గిడ్డంగులలో నిల్వ ఉంచిన వందలాది బస్తాలను అధ్యయనకర్తలు పరిశీలించారు. వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (ఐసీఏఆర్‌- సీఐపీహెచ్‌ఈటీ) ఈ సర్వేను నిర్వహించింది.

ప్రమాణాలు పాటిస్తే…
కందులు, శనగలు, మినుములు, పచ్చి శనగలు వంటి పప్పులను పన్నెండు నెలల పాటు నిల్వ ఉంచితే నాణ్యతలో వచ్చే మార్పులను ఈ సర్వే గుర్తించింది. పప్పు ధాన్యాలను నిల్వ చేసేటప్పుడు మెరుగైన ప్రమాణాలను పాటిస్తే అవి చెడిపోకుండా ఉంటాయని, తద్వారా వృథాను అరికట్టవచ్చునని, అంతేకాక దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించవచ్చునని సర్వేలో పాల్గొన్న ఒక అధికారి చెప్పారు. పంట కోతల అనంతరం ఎదురయ్యే సమస్యలు…ముఖ్యంగా తగిన గిడ్డంగులు అందుబాటులో లేకపోవడం, వాటిలో నిల్వ చేసేటప్పుడు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల దేశంలో తొమ్మిది శాతం పప్పుధాన్యాలు వృథా అవుతున్నాయి. ‘సర్వే ఫలితాలను పరిశీలించడం జరిగింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు పంటను నిల్వ చేయడంలో ఏకీకృత ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తించాము’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు.

అశాస్త్రీయ నిల్వతో ప్రొటీన్‌ లోపం
‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ విధానం ప్రకారం పరిశోధకులు దెబ్బతిన్న పప్పు ధాన్యాలు, పురుగు పట్టిన ధాన్యాలు, తేమ శాతం ఉన్న ధాన్యాలు, బరువు తగ్గిన ధాన్యాలు, సూక్ష్మజీవుల దాడికి గురైన ధాన్యాలు… ఇలా వివిధ రకాల ధాన్యాలపై త్రైమాసిక డేటాను నమోదు చేశారు. అధిక తేమ, తగినంత ఆక్సిజన్‌ సరఫరా లోపించడం వంటి అంశాలు పంట నాణ్యతను, రంగును ప్రభావితం చేస్తాయని, కీటకాల దాడిని పెంచుతాయని వారు గుర్తించారు’ అని అధ్యయనం తెలిపింది. పప్పు ధాన్యాలను అశాస్త్రీయంగా, సరైన విధంగా నిల్వ చేయకపోతే వాటిలో అత్యవసర ప్రొటీన్‌ లోపిస్తుందని చెప్పింది. పోషకాహార లోపాలను నివారించడంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న గిడ్డంగి పద్ధతులకు ఏనాడో కాలం చెల్లింది. పప్పు ధాన్యాల యాజమాన్యం విషయంలో నిర్దిష్ట నిబంధనలేవీ లేకపోవడం కూడా లోపంగా కన్పిస్తోందని పరిశ్రమకు చెందిన వారు, నిపుణులు అభిప్రాయపడ్డారు.

పప్పుల కోసం ఆత్మనిర్భరత మిషన్‌
దేశం పప్పు ధాన్యాల కొరత అధికంగా ఉంది. దీంతో డిమాండ్‌ను తీర్చడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వెల్లడైన సర్వే నివేదిక ఫలితాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పప్పు ధాన్యాల రంగంలో ఆత్మ నిర్భరత మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించింది. ఐదేండ్లలో రూ.11,440 కోట్లు కేటాయిస్తానని తెలిపింది. 2030-31 నాటికి ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచి స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకోసం పంట విస్తీర్ణాన్ని పెంచాలని, మేలైన విత్తనాలు సరఫరా చేయాలని, కనీస మద్దతు ధరకు పప్పులు సేకరించాలని, దిగుమతులను తగ్గించాలని, ధరలను స్థిరంగా ఉంచాలని, రైతుల ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించింది.

తేమ, ఉష్ణోగ్రత, కీటకాలే కీలకం
గత ఆరేండ్ల కాలంలో జరిగిన పప్పు ధాన్యాల ఉత్పత్తిని పరిశీలిస్తే 2021-22 అత్యధికంగా 27.3 మిలియన్‌ టన్నుల దిగుబడి రాగా 2019-20లో అత్యల్పంగా 23 మిలియన్‌ టన్నులు మాత్రమే వచ్చిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. అయితే దిగుమతులకు సంబంధించిన గణాంకాలు దీనికి పూర్తిగా భిన్నమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. సుంకాలు అనుకూలంగా ఉండడం, దేశంలో ధరలు తక్కువగా ఉండడంతో 2022-23లో 2.6 మిలియన్‌ టన్నుల పప్పు ధాన్యాల దిగుమతి జరగ్గా అది 2024-25 నాటికి 6.7 మిలియన్‌ టన్నులకు పెరిగింది. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో ఇదే గరిష్టం. కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థల నిర్వహణలోని వేర్‌ హౌస్‌లలో నిల్వ ఉంచిన పప్పు ధాన్యాలకు సంబంధించి తేమ స్థాయి, ఉష్ణోగ్రత, కీటకాల దాడి వంటి విషయాలలో వైవిధ్యం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితులలో దీర్ఘకాలం నిల్వ ఉంచినట్లయితే తృణధాన్యాల కంటే పప్పు ధాన్యాలే ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉన్నదని సర్వే చెప్పింది.

ఎల్‌డీపీఈ సంచుల్లో నిల్వచేస్తే…
వ్యవసాయ మంత్రిత్వ శాఖ అం దించిన డేటా ప్రకారం 2021- 22 ఆర్థిక సంవత్సరంలో 27.3 మిలియన్‌ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి జరగ్గా 2022-23లో అది 26 మిలియన్‌ టన్నులకు తగ్గిపోయింది. 2023-24లో మరింత పడిపోయి 24.5 మిలియన్‌ టన్ను లకు చేరింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో దిగుబడి 25.7 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 12 శాతం కంటే ఎక్కువ తేమ కలిగిన మినుములు, పెసలను తక్కువ సాంద్రత కలిగిన పాలిథిన్‌ (ఎల్‌డీపీఈ) సంచులలో నిల్వ ఉంచినప్పుడు కేవలం మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలోనే వాటిలో శిలీంధ్రాలు పెరగడాన్ని సర్వే సందర్భంగా గుర్తించారు.

అంతేకాక అవి ముద్దగా కలిసిపోయాయి. గిడ్డంగులలో పప్పు ధాన్యాలను నిల్వ చేయడానికి 75 మైక్రాన్ల మందం కలిగిన ఎల్‌డీపీఈ సంచులను ఉపయోగించారు. అయితే అవి పప్పు ధాన్యాల నిల్వకు ఏ మాత్రం అనుకూలమైనవి కావు. ఎందుకంటే అవి వాతావరణంలో ఏర్పడే హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించలేవు. వాటికి బదులుగా తగిన మందంతో ఉన్న పాలీప్రొపైలిన్‌ సంచులను లేదా లామినేటెడ్‌ ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ను ఉపయోగించాలని సర్వే సూచించింది. గాలి చొరబడకుండా సంచులకు సీలు వేస్తే కీటకాల బెడద కూడా తగ్గుతుంది.

నిపుణులు ఏమన్నారంటే…
‘పంట కోసిన తర్వాత నష్టాలను తగ్గించడానికి, నాణ్యతను కాపాడడానికి, ఆహార భద్రతను మెరుగుపరచడానికి పప్పు ధాన్యాల నిల్వకు సంబంధించి జాతీయ ప్రమాణాలు అవసరం. స్పష్టమైన, ఏకీకృత నిబంధనలు పలు సమస్యలను పరిష్కరిస్తాయి. ఫలితంగా మార్కెట్‌లో విశ్వాసం పెరుగుతుంది’ అని ఐసీఏఆర్‌ మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బీబీ సింగ్‌ చెప్పారు. గిడ్డంగులలో క్రమం తప్పకుండా భౌతిక తనిఖీలు చేస్తే దొంగతనాలను, కల్తీని నిరోధించవచ్చునని స్టార్‌ అగ్రి అనే వేర్‌హౌసింగ్‌ కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. సంవత్సరం క్రితం రూపొందించిన నిల్వ ప్రమాణాలు నేటి పరిస్థితులకు అనుగుణంగా లేవని అన్నారు. సర్వే నిర్వహించిన రాష్ట్రాలలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. స్థానికంగా ఉండే తేమ, ఉష్ణోగ్రతలను బట్టి గిడ్డంగి పనితీరు మారుతుంటుంది.

పప్పు ధాన్యాలు అన్ని రాష్ట్రాల గిడ్డంగులలో నిల్వ చేయలేదని సర్వే గుర్తించింది. కాయధాన్యాలను ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ గిడ్డంగులలో నిల్వ చేశారు. కందుల్ని కర్నాటక, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగులలో నిల్వ చేశారు. మొత్తంగా సర్వేలో 208 శనగ నమూనాలు, 177 కంది నమూనాలు, 72 మినుము నమూనాలు, 42 పచ్చి శనగ నమూనాలు, 30 కాయ ధాన్యాల నమూనాలను విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన మిథైల్‌ బ్రోమైడ్‌ను వాడవద్దని సర్వే హెచ్చరించింది. ఓడరేవులలో దిగుమతి చేసుకున్న పప్పు ధాన్యాలను నిల్వ చేయడానికి అల్యూమినియం ఫాస్పైడ్‌ను సూచించిన మోతాదులో మాత్రమే వినియోగించాలని చెప్పింది. కీటకాలను గుర్తించిన వెంటనే ఫ్యూమిగేషన్‌ చేయాలని సూచించింది. లేనిపక్షంలో తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -