మనువాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం
13 గంటల పని అమానవీయం : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
అనంతపురం : బిజెపి పాలనలో మహిళలకు ఏ మాత్రమూ రక్షణ లేకుండా పోయిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా జరుగుతున్న ఐద్వా రాష్ట్ర 16వ మహాసభలో పాల్గొనేందుకు ఆమె అనంతపురం విచ్చేశారు. లక్ష్మిసెహగల్ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ధావలే మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగాయని వివరించారు. ఈ దాడుల్లో బాధితుల కంటే నిందితులకే ప్రభుత్వ సహకారం ఉంటోందని విమర్శించారు. హత్రాస్ కేసులోని నిందితులందరూ ఇప్పుడు బెయిల్‌పై విడుదలై ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మహిళలపై నమోదైన కేసుల్లో కేవలం 27 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయని, ప్రభుత్వ సహకారంతోనే ఈ కేసులు అత్యధికం నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని అన్ని రంగాలనూ అంబాని, అదానిలకు కట్టబెడుతోందన్నారు. అన్నింటినీ ప్రయివేటీకరించడం వల్ల రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. తద్వారా ఎక్కువగా నష్టపోతున్నది మహిళలేనని వివరించారు. దీనివల్ల నిరుద్యోగం సైతం పెరుగుతోందని, ఆదాయాలు తగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలు ప్రజల నుంచి 24 శాతం నుంచి 200 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయన్నారు. కట్టలేని వారిపై ఒత్తిడి పెంచడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇందులో అత్యధికం మహిళలే బాధితులుగా ఉన్నారని వివరించారు. పని గంటలను పెంచేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా మహిళలకు ప్రతికూలమన్నారు.
వారి ఆరోగ్యాలపైనా ఎక్కువ ప్రభావం ఉంటోందని తెలిపారు. 13 గంటల పని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడడం అమానవీయమైన చర్య అని అన్నారు. మనువాదాన్ని దేశంలో అమలు చేయాలని బిజెపి చూస్తోందని, దీనివల్ల నష్టపోయేది మహిళలేనని తెలిపారు. మహిళలకు సమానహక్కులు కల్పించడానికి మనువాదం అంగీకరించదన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటాన్ని ఐద్వా రూపొందిస్తుందని తెలిపారు. ఐద్వా జాతీయ అధ్యక్షులు శ్రీమతి టీచర్ మాట్లాడుతూ కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యంపై అక్కడి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుందన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి,ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర కోశాధికారి సావిత్రి పాల్గొన్నారు.