Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుసినీ థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా

సినీ థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ విషయమై మంగళవారం తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఉదయం నుంచి నిర్మాతలు, పంపిణీదారులతో జరిగిన వేర్వేరు సమావేశాల్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. థియేటర్లను నడుపుతూనే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే, ఉదయం 11 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సుమారు 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరైనట్లు సమాచారం. అనంతరం, సాయంత్రం 4 గంటలకు తెలుగు నిర్మాతలతో ఛాంబర్ పెద్దలు చర్చలు జరిపారు. ఈ రెండు సమావేశాల్లోనూ థియేటర్ల మూసివేత ప్రతిపాదనపై వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలలో అత్యధిక శాతం మంది సభ్యులు థియేటర్ల సమ్మెకు సుముఖత చూపలేదని, ప్రదర్శనలు కొనసాగిస్తూనే సమస్యలను పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజుల పాటు థియేటర్లు మూసివేయడం, అలాగే నటీనటుల పారితోషికాల విషయంలో కొన్ని రోజుల పాటు షూటింగులు నిలిపివేయడం వంటివి జరిగాయని, అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు రాలేదని పలువురు సభ్యులు గుర్తుచేశారు. ఈ అనుభవాల దృష్ట్యా, ఈసారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు ప్రదర్శిస్తూనే సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని వారు సూచించారు.

ప్రస్తుతం పైరసీ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, ఓటీటీ వేదికల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం గణనీయంగా తగ్గిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు మే 30 నుంచి పలు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయని, ఇలాంటి కీలక సమయంలో థియేటర్లు మూసివేస్తే పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు వారు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో జూన్ 1 నుంచి జరగాల్సిన థియేటర్ల బంద్ ప్రస్తుతానికి ఆగిపోయినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తదుపరి చర్చల ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు పడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -