కేంద్ర సాధికార కమిటీపై
మాజీ సివిల్ సర్వెంట్ల ఆందోళన
సీజేఐ గవాయ్‌కి 60 మంది లేఖ
న్యూఢిల్లీ : కేంద్ర పర్యా వరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో పని చేసే సెంట్రల్ సాధి కార కమిటీ (సీఈసీ) నిష్పాక్షికత గురించి రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో 60 మంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్ల బృందం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవారుకి లేఖ రాసింది. అందులో పలు అంశాలను బృంద సభ్యులు లేవనెత్తారు.
సీఈసీ సభ్యుల నుంచి స్వతంత్ర సలహాలు ఆశించలేం
సీఈసీకి సంబంధించి అనేక ప్రయోజనాల సంఘర్షణలకు సంబంధించి మాజీ సివిల్ సర్వెంట్లు తీవ్రమైన ఆందోళనలను వెలిబుచ్చారు. ”సీఈసీ సభ్యులలో ఇద్దరు భారత ప్రభుత్వంలో అత్యున్నత అటవీ, వన్యప్రాణుల విభాగంలో డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శిగా పదవులు నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ చేశారు. దీంతో విధాన రూపకల్పనలో దగ్గరి సంబంధం కలిగి ఉన్న వీరు సీఈసీలో భాగంగా ఉంటే సుప్రీంకోర్టుకు స్వతంత్ర సలహా ఇస్తారని ఆశించలేం” అని సదరు లేఖలో వారు పేర్కొన్నారు. అటవీ సంరక్షణ సవరణ బిల్లు 2023ను తయారు చేసింది అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో అధికారంలో ఉన్న సీఈసీ సభ్యుడని వివరించారు. అంతే కాదు, బిల్లును, శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులతో సహా ప్రజలు లేవనెత్తిన వివిధ ఆందోళనలను పరి శీలించాలని సూచించబడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముందు దానిని సదరు సభ్యుడు సమర్థించారని గుర్తు చేశారు.
ఏమిటీ సీఈసీ?
సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు 2002లో సీఈసీని తొలిసారిగా ఏర్పాటు చేశారు. అడవులు, వన్యప్రాణులు, సంరక్షణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులను ట్రాక్ చేయటానికీ, ఈ విషయాలలో వివిధ పార్టీలు (వాదప్రతివాదులు) నిబంధనలు పాటించని కేసులను పరిశీలించటానికి దీని ఏర్పాటు జరిగింది. సీఈసీలో పదవీవిరమణ చేసిన ప్రభుత్వ అధికారులే కాకుండా ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉంటారు. అయితే,డిసెంబర్, 2023లో సీఈసీని పునర్నిర్మించారు. కొత్త సీఈసీలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో ఉన్నత పదవులు నిర్వహించిన పదవీ విరమణ చేసిన అధికారులు మాత్రమే ఉంటారు. దీంతో, సీఈసీ నిష్పాక్షికతపై రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతనెల 30న లేఖ
ఈ మేరకు గతనెల 30న జస్టిస్ గవారుకు వారు లేఖ రాశారు. ప్రయోజనాల సంఘర్షణ, సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన గురించి పెద్ద ఆందోళన ఉన్నదనీ, ఇది దేశంలో అడవుల తరుగుదలను మరింత ముందుకు తీసుకెళ్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై సంతకం చేసినవారిలో కేరళలోని మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకృతి శ్రీవాస్తవ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మీనా గుప్తా, బీహార్ మాజీ ప్రధాన కార్యదర్శి అనుప్ ముఖర్జీ, ప్లానింగ్ కమిషన్ మాజీ కార్యదర్శి ఎన్‌సి సక్సేనా, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రిబీరోలు ఉన్నారు.
అటవీ సంరక్షణ చట్టంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు
ప్రస్తుతం, సుప్రీంకోర్టులో దాఖలైన అనేక పిటిషన్లు అటవీ సంరక్షణ చట్టం 2023ని సవాలు చేశాయి. ఈ కేసు లను సర్వోన్నత న్యాయస్థానం ఇంకా విచారిస్తున్నది. ఈ అంశంపై దాని తుది నిర్ణయం పెండింగ్‌లో ఉన్నది. ఇందులో సీఈసీ పాత్ర కీలకం కానున్నది. సీఈసీ, దాని సభ్యులు సుప్రీంకోర్టుకు సలహాదారు పాత్రను పోషిస్తారు. ఈ కేసుపై కూడా వారు కోర్టుకు సలహా ఇస్తారు. దీంతో సీఈసీలో స్వతంత్ర సభ్యులు లేకపోవటాన్ని లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు ఆక్షేపించారు. సీఈసీ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీజేఐని మాజీ బ్యూరోక్రాట్లు కోరారు.