రెండో టీ20లో సఫారీల గెలుపు
దక్షిణాఫ్రికా 213/4, బారత్ 162/10
నవతెలంగాణ-చంఢగీడ్
పొట్టి సిరీస్‌లో సఫారీలు గట్టిగా పుంజుకున్నారు. ముల్లాన్‌పూర్‌లో గురువారం జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా సాధికారిక విజయం సాధించింది. 214 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లను 162 పరుగులకు ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (17) రెండు సిక్సర్లతో ఛేదనను దూకుడుగా ఆరంభించినా.. శుభమన్ గిల్ (0), సూర్యకుమార్ యాదవ్ (5) నిరాశపరిచారు. పవర్‌ప్లేలోనే గిల్, అభిషేక్, సూర్య డగౌట్‌కు చేరగా భారత్ కష్టాల్లో కూరుకుంది. తిలక్ వర్మ (62, 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో పోరాడినా.. అప్పటికే మ్యాచ్ సఫారీ చేతుల్లోకి వెళ్లిపోయింది. హార్దిక్ పాండ్య (20, 23 బంతుల్లో 1 సిక్స్), అక్షర్ పటేల్ (21, 21 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. 19.1 ఓవర్లలో 162 పరుగులకు భారత్ ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (90, 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) రాణించటంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది.
డికాక్ దూకుడు
క్వింటన్ డికాక్ ముల్లాన్‌పూర్‌లో విశ్వరూపం చూపించాడు. రీజా హెండ్రిక్స్ (8), ఎడెన్ మార్‌క్రామ్ (29), డొనాల్డ్ బ్రెవిస్ (14)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 26 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన డికాక్.. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. స్లాగ్ ఓవర్లలో డికాక్ అవుటైనా.. ఆఖర్లో డొనొవాన్ ఫెరీరా (30 నాటౌట్), డెవిడ్ మిల్లర్ (20 నాటౌట్) దంచికొట్టారు. మంచుతో బంతిపై పట్టు చిక్కక భారత పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్ తడబాటుకు గురయ్యారు. 8 ఓవర్లలో ఏకంగా 99 పరుగులు సమర్పించుకున్నారు. డికాక్, ఫెరీరా, మిల్లర్ మెరుపులతో దక్షిణాఫ్రికా 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
డికాక్ దంచెన్
- Advertisement -
- Advertisement -



