– అనుమతులకే ఆలస్యం
– మందకొడిగా జాతీయ రహదారి 163 పనులు
– రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కొడంగల్-భూపాలపట్నం 163 జాతీయ రహదారిలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పలు బ్రిడ్జి నిర్మాణపు పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. హన్మకొండ జిల్లా దామెర క్రాస్ రోడ్డు నుంచి ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయం వరకు పలు నిర్మాణాలను ఆర్ అండ్ బీ (జాతీయ రహదారులు) విభాగం చేపట్టింది. 2022లో ఈ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.208 కోట్లను మంజూరు చేసింది. ఎస్సారెస్పీ కాలువలపై గతంలో నిర్మించిన డబుల్ లైన్ల బ్రిడ్జిల స్థానంలో వాటిని విస్తరించి కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇందులో కటాక్షపూర్ చెరువు వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి సవరించిన డిజైన్‌లను అనుమతుల కోసం కేంద్రానికి సమర్పించినా ఉలుకుపలుకూ లేదు. దాంతో కటాక్షపూర్ చెరువుపై బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరిగింది. 2022 జులైలో వృద్ధి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ ఈ పనులను చేపట్టింది. 2024 జులైలోనే ఈ పనులను పూర్తి చేయాల్సి ఉన్నా సంబంధిత గుత్తేదారు ఈ పనులను పూర్తి చేయలేదు.
బ్రిడ్జి నిర్మాణ అనుమతుల్లో కేంద్రం జాప్యం
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువుపై నిర్మించా ల్సిన బ్రిడ్జిని 5 మీటర్ల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించారు. అయితే గ్రామం లోని పలు ఇండ్లు వరద ముంపునకు గురవడంతో పాటు సింగారం వెళ్లే రహదారి వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో 3 మీటర్ల ఎత్తులోనే నిర్మించడానికి కొత్త ప్రతిపాదనలను కేంద్రానికి జాతీయ రహ దారుల విభాగం అధికారులు పంపించారు. అయినా కేంద్రం నుంచి సకాలం లో అనుమతులు రాలేదు. 2025 ఫిబ్రవరిలో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం అనుమతివ్వడంతో పనులు ప్రారంభించినా వర్షాలతో పనులు నిలిచాయి.
వర్షాలతో వాహనదారుల ఇబ్బందులు
జాతీయ రహదారి 163పై జరుగుతున్న ఊరుగొండ, ఒగ్లాపూర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల నేపథ్యంలో రోడ్డు డైవర్షన్ చేయడం, వర్షాలతో ఆ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కటాక్షపూర్ చెరువు వద్ద మరింత సమస్యాత్మకంగా మారింది. అదేవిధంగా ములుగు జిల్లా జాకారం వద్ద ఎస్సారెస్పీ డీబీఎం 38పై బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలోనూ ట్రాఫిక్ డైవర్షన్ చేసినా వర్షాలతో ఆ రోడ్డు గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే ఈ పనులను పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కటాక్షపూర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES