మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
45 శాతం మాత్రమే వసూల్…లక్ష్యం చేరేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాలను అభివృద్ధి పర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల అవుతాయి. దీనికి తోడు ప్రతీఏటా ఇంటి పన్ను పేరిట పంచాయతీ సిబ్బంది పన్ను వసూళ్లు చేస్తుంటారు. ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కానీ సమయంలో ఇంటి పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్నే వాడుకుంటారు. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా వసూళ్లు చేస్తుంటారు. గతంలో మూడు,నాలుగు పంచాయతీలకు ఒక్క కార్యదర్శి ఉండటంతో వంద శాతం పన్ను వసూళ్లు అయ్యేది కాదు. కాగా ప్రతీ పంచాయతీకి కార్యదర్శులను నియమించింది. అయితే క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
మండలంలో ఇలా వసూళ్లు..
మండలంలో 15 పంచాయతీలుండగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.29 లక్షల 58 వేలను ఇంటి పన్నుల రూపంలో వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 18 రోజులే సమయం ఉండగా ఇప్పటికి కేవలం రూ.13 లక్షల 22 వేలు మాత్రమే కాగా 45 శాతం వసూళ్లు పూర్తయింది. దాదాపు 16,35,152 లక్షలు వసూళ్లు చేస్తే తప్ప లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. మల్లంపల్లిలో పంచాయతీలో అధికంగా 88 శాతం పన్ను వసూళ్లు కాగా మండల కేంద్రమైన వళ్లెంకుంటలో అత్యల్పంగా 34 శాతం మాత్రమే వసూళ్లు పూర్తయింది. క్షేత్రస్థాయిలో పంచాయతీ సిబ్బంది పన్ను వసూళ్లపై దృష్టిసారిస్తే తప్ప పన్ను వసూళ్ల లక్ష్యం చేరువయ్యే అవకాశం లేదు. వంద శాతం పన్ను వసూళ్లు అయ్యేలా క్షేత్రస్థాయిలో సిబ్బందికి అధికారులు అదేశాలు జారీ చేశారు.
లక్ష్యం చేరుకుంటాం: విక్రమ్ కుమార్…ఎంపిఓ
క్షేత్ర స్థాయిలో వంద శాతం పన్ను వసూళ్లు అయ్యేలా సిబ్బందికి దిశానిర్దేశం చేశాం. ఈనెల 31లోగా వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. అందుకు తగ్గ ప్రణాళిక లు సిద్ధం చేశాం.



