నేషనల్ హెరాల్డ్ కేసులో తాజా పరిణామం
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిటిషన్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందన తెలపాల్సిందిగా గాంధీ కుటుంబాన్ని ఆదేశించింది. ప్రధాన పిటిషన్‌తో పాటు డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే కోరుతూ ఈడీ దాఖలు చేసిన దరఖాస్తుపై జస్టిస్ రవీందర్ దుడేజా.. సోనియా, రాహుల్‌లతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 2026 మార్చి 12కి వాయిదా వేశారు. ఈ కేసులో ఈడీ చార్జీషీటును పరిగణలోకి తీసుకోవడం ‘చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు’ అని, ఈడీ దర్యాప్తు ప్రయివేటు ఫిర్యాదు ఆధారంగా వచ్చిందనీ, ఎఫ్‌ఐఆర్ నుంచి కాదని డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు ఈడీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించిన విషయం విదితమే.



