Thursday, October 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఢిల్లీ అల్లర్లు: కట్టుకథలు, కల్పిత సాక్ష్యాలు

ఢిల్లీ అల్లర్లు: కట్టుకథలు, కల్పిత సాక్ష్యాలు

- Advertisement -

2020 భయంకరమైన ఢిల్లీ అల్లర్లలోని క్రిమినల్‌ కేసుల కోర్టు విచారణలో విస్తుగొల్పే విషయాలను ‘ఇండియన్‌ ఎక్సప్రెస్‌’ దినపత్రిక బయటపెట్టింది. సెప్టెంబర్‌ 17, 2025 నాటి దినపత్రిక అ విశ్లేషణను ప్రచురించింది. దాదాపు ఐదోవంతు కేసుల్లో నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. కల్పిత సాక్ష్యాలు, నకిలీ సాక్షులు, పోలీసులే చెప్పి రాయించిన వాంగ్మూలాలు, విచారణాధికారుల ఊహల్లో పుట్టించిన ‘సత్యాలు’, కృత్రిమ కథనాలు దీనికి కారణం. న్యాయమూర్తులు ఈ నిర్ధారణకు రావటానికి ఇవే కారణాలని కోర్టులు విడుదల చేసిన 93 కేసుల్లో 17 కేసులను వివరంగా పరిశీలించిన అనంతరం వెల్లడిచేసింది ఆ దినపత్రిక. ఈ ఏడాది ఆగస్టు చివరికి 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తంగా 695 కేసులు ఢిల్లీ కింది కోర్టులలో నడుస్తున్నాయి, వాటిల్లో 116 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. ఈ 116 కేసులకుగాను 97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా ప్రత్యక్ష నియంత్రణ కింద తెలివికి, సామర్థ్యానికి గొప్పగా కితాబులందుకున్న ఢిల్లీ పోలీసుల విచారణ ఇప్పుడు ఒక్కసారిగా చతికిలబడింది. అల్లర్లు జరిగిన కొద్ది వారాల తర్వాత మార్చి 11, 2020న పార్లమెంట్‌ లో అమిత్‌ షా ఢిల్లీ పోలీసుల పనితనానికి అభినందనలు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన ప్రకటన చేశారు. అందులో 700 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, 2647 మందిని నిర్బంధించడము/ అరెస్టు చేయటం జరిగిందని, 25 కంప్యూటర్ల మీద సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించడం జరిగిందని, మనుషుల ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్‌ను ఉపయోగించి ప్రభుత్వం దగ్గర ఉన్న ఓటర్‌ ఐడి, డ్రైవింగ్‌ లైసెన్స్‌లో డాటా బేస్‌లో సరిపోల్చి నిందితులను, గుర్తించడం జరిగిందని ఆ ప్రకటనలో చెప్పకొచ్చారు. ఎంతో శాస్త్రీయగా సాక్షాధారాలను సేకరించడానికి నలభై బృందాలు పనిచేశాయని, తీవ్రమైన 49 కేసులను విచారించడానికి రెండు ప్రత్యేక విచారణ బృందాలను -సిట్స్‌- ఏర్పాటు చేశామని పార్లమెంటుకు చెప్పారు. ఈ అల్లర్ల గనక ఒక భారీకుట్ర దాగి ఉన్నదని, దాన్ని ఛేదించటానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని పార్లమెంటుకు తెలియజేశారు.(ఈ వివరాలను పీపుల్స్‌ డెమోక్రసీ గత సంచికలో వేసిన ఒక వ్యాసంలో చర్చించింది.) సహజంగా దూకుడును, సూక్ష్మ బుద్ధిని ప్రదర్శించే షా, డజన్లకొద్దీ అధికార సిబ్బందిని, తాజా టెక్నాలజీని పోగేసి, 53 మంది మరణానికి, 700 మంది గాయాలకు కారణమైన ఈ అల్లర్లలో బాధితులైన వేలాది కుటుంబాలకు న్యాయం లభించేటట్టు చేస్తాడని చాలామంది భావించారు.

‘ఎక్స్‌ప్రెస్‌’ పరిశోధన పచ్చి నిజాలను బయటపెట్టింది. నేరస్తులను కటాకటాల వెనక్కితోసి, న్యాయాన్ని నిలబెట్టాల్సిన క్షేత్రస్థాయి విచారణాధికారులు ఎటువంటి కల్పిత కధలు అల్లుతారో, మసిపూసి మారేడుకాయను చేస్తారో ఈ విశ్లేషణ తెలియచేసింది. గుర్తుంచుకోండి, ఇది కేవలం ప్రభుత్వంలోని తమ బాసులను మెప్పించటం కోసమే కాదు, పార్లమెంటులో షా స్వయంగా తన ప్రసంగంలో చేసిన సిద్ధాంతాన్ని నిజమని చెప్పటానికి ఇదంతా చేశారు. భారీకుట్ర అని చెప్పబడే దానిలో, అర్బన్‌ నక్సలైట్‌, జిహాదీస్టుల గుంపు కలిసి, దేశ రాజధానిలో ప్రజలను దారితప్పించి, పౌరసత్వ సవరణ బిల్లు (సిఏఏ) కు వ్యతిరేకంగా ఆందోళనను రెచ్చగొట్టి కుట్రకు తెరలేపారు. ఆ తర్వాత, వీరు ద్రోహ బుద్ధితో,అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఢిల్లీ నగరాన్ని సందర్శించినప్పుడు ప్రభుత్వాన్ని చెడుగా చూపించటానికి సిఏఏ వ్యతిరేక ఆందోళన వాడుకున్నారు. ఈ తప్పుడు, కల్పిత సాక్ష్యాలు, పోలీసులు చెప్పి రాయించిన వాంగ్మూలాలు – ఇవన్నీ భారీకుట్ర అని చెప్పబడే దాన్ని చూపించడానికి చేసినవే.

కనీసం పన్నెండు కేసులలో ఇటువంటి ”కృత్రిమ” సాక్షులను ప్రవేశ పెట్టడం గాని, ” కల్పిత” సాక్ష్యాలను కేసులో జొప్పించడం గాని జరిగిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అన్నది. సాక్షులను పరిశీలించి నమోదు చేసి కోర్టు ముందు ఉంచిన రుజువుల్లో కనీసం రెండు కేసుల్లో వాంగ్మూలాలు సాక్షులు సొంతంగా చెప్పింది కాదు, ”పోలీసులు చెప్పిన ప్రకారం రాయటమో, లేక పోలీసులు అదనంగా చేర్చటమో ” జరిగింది. ఒక కేసు విషయంలో కోర్టుకిచ్చే రికార్డులను ”తారుమారు చేయడాన్ని” జడ్జి ఎత్తిచూపారు. న్యూ ఉస్మాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్లో నమోదైన కేసుల్లో ఒక దాని విషయంలో ఆగస్టులో అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ప్రవీణ్‌సింగ్‌ ఇచ్చిన ఆదేశాన్ని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదహరించింది : ”ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌ చేత అసాధారణమైన రీతిలో దొంగ సాక్ష్యాలు పొందుపరిచారు. దీని ఫలితంగా నిందితుడి హక్కులు దారుణంగా అణచబడ్డాయి. కేసుమీద పని పూర్తి చేశామని చెప్పుకోవటం కోసం ఇది జరిగింది. ఇటువంటి దృష్టాంతాల వల్ల ప్రజల్లో విచారణ ప్రక్రియపై, చట్టంపై నమ్మకం సన్నగిల్లుతుంది.”

ఇక్కడ రెండు కేసులు గురించి చెప్పాలి. మొదటిది, నేరారోపణ చేసిన వ్యక్తి నిందితుడైన నూర్‌ మహమ్మద్‌ను గుర్తిస్తాడనే అబద్ధాన్ని పోలీసులు గట్టిగా చెప్పారు. అయితే, నిందితుడి గుర్తింపునకు జరిగే పరీక్ష లో -టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌లో ఆరోపణ చేసిన వ్యక్తి ఘోరంగా విఫలమయ్యాడు. నిందితుడికి వ్యతిరేకంగా కధ అల్లినట్టు పోలీసులకు ముందే తెలుసు అనే నిర్ధారణకు కోర్టు రావటం జరిగింది. రెండవ కేసులో, కోర్టుతీర్పులో ఈ విధంగా పేర్కొన్నారు: ”నేరం చేయటాన్ని కళ్లారా చూసానని చెప్తున్న మొహమ్మద్‌ అస్లాం అనే వ్యక్తి నిజంగా ఈ భూమి మీద ఉన్నాడా, లేడా అనే సందేహం కలుగుతున్నది. అతను కల్పితవ్యక్తి అనే మాటను కొట్టిపారవేయలేము.” కొన్ని కేసుల్లో పోలీసు సిబ్బందినే దొంగసాక్షులుగా ప్రాసిక్యూషన్‌ జడ్జి ముందుకు తెచ్చింది. ఒక కేసులో న్యాయమూర్తి తన తీర్పులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ”ఈ పరిస్థితులలో, అల్లర్లకు దిగిన వారిలో నిందితుడు నూర్‌ను చూసామనే కృత్రిమ వాదనను (ప్రాసిక్యూషన్‌ తరుఫు సాక్షి) 4 ( కానిస్టేబుల్‌ రోహతాష్‌) చేశాడు.” ఈ విధంగా పోలీసులు తెచ్చిన సాక్షుల బండారాన్ని విచారణ సమయంలో బయటపెట్టటం జరిగింది.

మరో తీర్పులో కోర్టు ఇలా చెప్పింది, ” ఈ పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షుల వాంగ్మూలంలో స్థిరంగా కనపడుతున్న లోపాలు చూస్తే వాంగ్మూలాలు ఒకే తరహాలో తయారు చేసినట్టు కనపడుతుంది. ముగ్గురు ప్రత్యక్ష సాక్షులను పరిశీలించిన అనంతర తెలుస్తున్నది ఏమిటంటే సంఘటనను సాక్షులు చూసారని కల్పించినట్టుగా కనపడుతున్నది.” రెండు కేసుల్లో, ముందు నిందితుడిని అరెస్టు చేసిన తరువాత అతని ఫొటోలను ప్రాసిక్యూషన్‌ సాక్షికి చూపించడం ద్వారా ”నిందిత వ్యక్తులను గుర్తించే ప్రత్యక్ష సాక్షులును కృత్రిమంగా తయారుచేశారు” అని సంబంధిత కోర్టు న్యాయమూర్తులు అన్నారు. మరొక కేసులో ‘ప్రత్యక్ష సాక్షులు’అని చెప్పి కేవలం ఇద్దరిని మాత్రమే కోర్టు ముందు హాజరుపరిస్తే ”ఆ ఇద్దరు కూడా అల్లర్లు జరిపిన వారిలో నిందితుడు ఉన్నాడని గుర్తించటానికి నిరాకరించారు. అంతేగాక, నేరారోపణ పత్రంలో ఉన్న వివరాలు పోలీసులు తమకు చెప్పి రాయించినవని” వారు అన్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో నమోదు చేశారు. అనేక కేసుల్లో కల్పిత సాక్ష్యాలను న్యాయమూర్తులు స్పష్టంగా బహిర్గతపరిచారు. ”02 ఏప్రిల్‌ 2020న నిందితుడిని గుర్తించటం అనేది బహుశా తర్వాత ఆలోచనా ఫలితంగా చేసినట్టు వుంది.”మరొకకేసు న్యాయమూర్తి తీర్పును ఈ విధంగా చెపుతూ ముగించారు ”…. ఈ ఇద్దరు బాధితులు/ గాయపడిన అధికారులు నిందితులను గుర్తించే ప్రక్రియ సందేహాస్పదంగా వున్నది. ”మరొక కేసులో ”కేసు డైరీకి సంబంధించి (సాక్షి ఇచ్చిన) వాంగ్మూలాన్ని తారుమారు చేసే అవకాశం కాదనలేం ” అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

మార్చి 2020లో (అల్లర్లు జరిగిన కొద్ది వారాలలోపే) అనేక తప్పుడు కేసులతో అమాయకులను ఇరికించి ఎఫ్‌ఐఆర్‌లు తయారు చేసినట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి. ఉదాహరణకు, తూర్పు ఢిల్లీ దయాల్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఆయుధ చట్టం, 1959 కింద ఎఫ్‌ఐఆర్‌ నెంబర్లు 0066/2020, 0067/2020, 0068/2020, 0069/2020, 0070/2030ను మీడియా పేర్కొన్నది. ఈ కేసులన్నిటిలోనూ ఒకే రకమైన కధనం, నేరారోపణ చేసిన వ్యక్తి పేరు, నిందితుడిని ఎక్కడ పట్టుకున్నారు, అతని పేరు ఇవి మాత్రమే తేడా. ఆ ఎఫ్‌ఐఆర్లు అన్ని చెప్పే దొక్కటే, నిందితుడు సందేహాస్పదంగా తిరుగుతూ, పోలీసులను తప్పించుకోవటానికి చూస్తుంటే, ఫలానా ఫలానా పోలీసు అతన్ని పట్టుకుని సోదా చేస్తే, అతని దగ్గర నాటు తుపాకీ దొరికింది. దాంతో అరెస్టు చేయటం జరిగింది. అటువంటి నిందితులందరూ ముస్లింలే. ఒక లాయరు ఈ కింది విధంగా చెప్పినట్టు మీడియా నివేదించింది. ”దయాల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరలో వున్న రెండు రహదారి కూడళ్లలో రాళ్లు రువ్వుకున్న ఘటనలు జరిగాయి. ఆ రాళ్లదాడిలో ఇరుక్కున్న కొందరు అక్కడనుంచి తప్పించుకోవటానికి దగ్గర్లోని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. వారికి రక్షణ కల్పించి, సురక్షిత ప్రాంతానికి చేర్చటానికి బదులు, పోలీసులు వారిని నిర్భందించి, హింసించి, ఆ తర్వాత అరెస్టు చేసారు.

పోలీసులు తరువాత ఈ వార్తను ఖండించారు అనుకోండి, అది వేరే విషయం. అల్లర్ల తరువాత మీడియా నివేదించిన సాధారణ సంఘటన ఏమిటంటే, ఒక మతానికి చెందిన వ్యక్తులను కాపాడటానికి, మరో మతానికి చెందిన ఫిర్యాదులను నీరుగార్చటానికి ఎఫ్‌ఐఆర్‌లను ఒకే బొత్తిగా చేయటం. 2023 నవంబర్‌లో ఈ విషయంపై ఢిల్లీ కోర్టు పోలీసులను అభిసించింది. సంబంధం లేని ఫిర్యాదులన్నీ ఒక కట్టగా చేయటం తప్పు అన్నది. ముఖ్యంగా సామూహిక హింసాత్మాక సంఘటనల్లో, ఢిల్లీలో అనేక సార్లు ఇలా చేయటమనేది పూర్తిగా చట్టవిరుద్ధం, దురుద్దేశంతో కూడుకున్నది అని చెప్పింది.
ఒక దుర్మార్గమైన కేసులో, హాజీ హసీం అలీ శివవిహార్‌లో వున్న తన రెండంతస్తుల భవనాన్ని ఫిబ్రవరి 25 సాయుధ గుంపు తగలపెట్టిందని కర్వాల్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదును నరేష్‌ చంద్‌ చేసిన ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌. 72/2020తో కలిపేశారు. నరేష్‌చంద్‌ ఫిర్యాదుకూడా తన ఇంటిని, దుకాణాన్ని అల్లరి మూక తగలబెట్టిందనేదే. అయితే, పోలీసులు చేసినదేమిటంటే, నరేష్‌చంద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్న వారిని పట్టుకోవటానికి బదులు, నరేష్‌చంద్‌ ఇంటిని, దుకాణాన్ని అలీ తగలపెట్టడని ఆరోపించి, కటకటాల వెనక్కి తోశారు. దర్యాప్తును నిర్వహిస్తున్న ఢిల్లీ పోలీసుల ఇటువంటి ”ఘోర నిర్లక్ష్యం” వైఖరిని కోర్టు దుయ్యబట్టింది. పోలీసుల పనితీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

”ప్రతివాది నెం.1( అలీ) ఇంటిని తగలబెట్టటం పై చేసిన ఫిర్యాదును, నరేష్‌ చంద్‌ ఫిర్యాదును కర్వాల్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 72/2020 తో కలిపేయటం, ఆ తరువాత ప్రతివాదిని అదే కేసులో అరెస్టు చేయటం. దీని అర్ధం, ఒకే కేసులో విషయంలో ఫిర్యాదుదారుడే నిందితుడిగా ఉండటం. ఇది విచిత్రమైన సంగతే కాక, అసహజమైన విషయం కూడా, ” అని మార్చి 26న ఈ కేసును విచారిస్తున్న అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి వినోద్‌ యాదవ్‌ అన్నారు. ఢిల్లీ అల్లర్ల ఘటనలో విచారకరమైన విషయం ఏమిటంటే తన కల్మష, విభజన సిద్ధాంతానికి అనుకూలంగా కేంద్ర పాలక పార్టీ నేర పరిశోధక సంస్థలను హైజాక్‌ చేయటం. అదృష్టంకొద్దీ, కొన్ని కేసులలో న్యాయ పరిశీలన ఈ ప్రమాదకర ఎత్తుగడలను గమనించింది. కానీ, ఇది న్యాయాన్ని అందించే ప్రక్రియపై, చట్ట సమానత్వంపై పొడపాటి నీలినీడలను వ్యాపింపచేస్తున్నది.
(పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో)
అనువాదం : కర్లపాలెం

  • సావేరా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -