– మరోసారి అధిక ధర పలికిన తొర్రూర్ భూములు
– చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు
– సుమారు రూ.56 కోట్ల ఆదాయం
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు భారీగా పాల్గొన్నారు. బాటసింగారం ప్రాంతంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్‌లో రెండు రోజులుగా కొనసాగనున్న ఈ వేలం ద్వారా శనివారం 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం రూ 45 వేలకు అమ్ముడుపోయింది. సుమారు రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొర్రూర్‌తోపాటు ఓఆర్‌ఆర్‌కు సమీపంలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. భూముల ద్వారా తొర్రూర్‌లోని ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు దాదాపు 150 మంది ముందుకు వచ్చారు. కార్నర్ ప్లాట్‌ను దక్కించుకునేందుకు వేలం పాటలో 20 దఫాలుగా పైగా ధరలు పెంచుతూ పోటీ పడటమే ఇక్కడి ప్లాట్లకు ఉన్న డిమాండ్‌కు నిదర్శనం. 200 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల చదరపు గజం కనీస ధర (అప్ సెట్ ప్రైజ్) రూ.25 వేలుగా నిర్ణయించింది. కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, రూ. 43వేలు, రూ. 41 వేలకు కూడా కొనుగోలు చేశారు. మొత్తం మీద ఇక్కడ వేలం వేసిన భూములు సగటున చదరపు గజానికి రూ.31వేలకు అమ్ముడు పోయాయి. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జి. వి.రమణారెడ్డి, ఇ.ఇ.నరేందర్‌రెడ్డితో పాటు స్థానిక రెవిన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేలం పాటను నిర్వహించారు. కాగా తొర్రూర్ లేఅవుట్‌లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
పోచారం, బండ్లగూడల్లో 71 ఫ్లాట్ల కేటాయింపు
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకించి 71 ఫ్లాట్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి కేటాయించడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సుమారు రూ.11 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.



