– సిద్ధాంతాల స్థానంలో ‘స్విగ్గీ పాలిటిక్స్’
– విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాలి
– తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర కీలకం : డెమోక్రసీ అవార్డు వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ రాజకీయాల్లో సైద్ధాంతికపరమైన అంశాలు కాకుండా మేనేజ్‌మెంట్ రాజకీయాలు ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఏ పార్టీకైనా ఆయువు పట్టుగా ఉన్న కార్యకర్తల స్థానంలో వాలంటీర్ వ్యవస్థ వస్తోందనీ, ఇది దేశ భవిష్యత్‌కు పెను ప్రమాదమని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఇప్ఫాకారు, క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ప్రముఖ ఆర్ధిక నిపుణులు, విశ్లేషకులు మోహన్ గురుస్వామికి జైపాల్ రెడ్డి డెమోక్రసీ తొలి అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సిద్ధాంతపరమైన రాజకీయాలు కాకుండా ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్న ‘స్విగ్గీ పాలిటిక్స్’ తెరమీదకొచ్చాయనీ, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి లేకపోతే తెలంగాణ ఏర్పాటయ్యేది కాదని తెలిపారు. లోక్‌సభలో చర్చ లేకుండానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం వెనుక ఆయన కృషి ఉందంటూ స్వయంగా సోనియాగాంధీ తనతో ఒక సందర్భంగా చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాలంటూ ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర లేకపోతే కొత్త రాష్ట్రం వచ్చేది కాదన్నారు.
కాంగ్రెస్‌ను వీడినా, తిరిగి కాంగ్రెస్‌లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప, పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో విద్యార్థి రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ప్రతిపక్షాల సహేతుకమైన సూచనలను అధికార పక్షం పరిగణనలోకి తీసుకోవడంతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందంటూ జైపాల్‌రెడ్డి చెప్పేవారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు శాసనసభ నుంచి ఎవర్నీ సస్పెండ్ చేయలేదని తెలిపారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక నిలువెత్తు శిఖరమని చెప్పారు. పీవీ, జైపాల్ రెడ్డి వంటి మహనీయుల స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థి నాయకుడిగా, నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వివిధ హౌదాల్లో జైపాల్‌రెడ్డి పనిచేశారని గుర్తు చేశారు. 1969లో తొలిసారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రాధాన్యతను గుర్తించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. పార్లమెంట్‌లో రాణించిన ఎంతో మంది గొప్ప మేధావులతో ఆయనకు ఏనాడూ వ్యక్తిగత వైరం లేదని స్పష్టం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన నేత జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. చివరి శ్వాస వరకు ప్రజాసమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారన్నారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై ఆయన ఎక్కువగా ఆలోచించేవారని గుర్తు చేశారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES