Wednesday, January 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రమాదంలో ప్రజాస్వామ్యం

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

- Advertisement -

– మతతత్వ శక్తులను ఐక్యంగా ఎదుర్కొందాం
– వర్గ రహిత సమసమాజ స్థాపనకు కృషి
– కమ్యూనిస్టులే దిక్సూచి : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా
– సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో సెమినార్‌
– ‘నేటి భారతదేశం – వామపక్షాల ముందున్న సవాళ్లు’పైసదస్సులో లెఫ్ట్‌ పార్టీల నేతలు, రాష్ట్ర డిప్యూటీ సీఎం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో వామపక్షాల భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న తరచూ వినిపిస్తున్నదని ఈ దేశ భవిష్యత్తే వామపక్షాలపై ఆధారపడి ఉందని నాలుగు ప్రధాన వామపక్షాల నేతలు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మునుపెన్నడూ లేనంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీతో ఈ దేశంలో స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలుగుతుందని అన్నారు. ‘సర్‌’ పేరుతో ఓటు హక్కును జనాభా లెక్కల పేరుతో అసలు జనాభా నుంచే తొలగించే కుట్రకు బీజేపీ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ఐక్య ఉద్యమాలే ఫాసిస్టు శక్తులను అడ్డుకోగలవని నేతలు స్పష్టం చేశారు. ఈ దేశంలో మతోన్మాద శక్తులను నిలువరించగలిగే శక్తి, కార్మిక వర్గం పక్షాన పోరాడగలిగే శక్తి, ఆర్థిక అసమానతలు లేని కుల రహిత సమాజాన్ని నిర్మించగలిగే శక్తి.. వామపక్షాలకే ఉందని తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మతతత్వ శక్తులను ఎదుర్కోవడంతోపాటు కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని లెఫ్ట్‌ నేతలు ప్రతినబూనారు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను కలుపుకుని ఈ దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడు కునేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఖమ్మంలోని ఎస్సార్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ”నేటి భారతదేశం వామపక్షాలు ముందున్న సవాళ్లు” అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ(ఎంఎల్‌)లేబరేషన్‌ జాతీయ కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ కార్యదర్శి జి. దేవరాజన్‌, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు.

కమ్యూనిస్టులే దిక్సూచి: డి. రాజా
దేశానికి కమ్యూనిస్టులే దిక్సూచి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాజకీయంగా ప్రజల పక్షాన పోరాడుతూ వందేండ్లు పూర్తి చేసుకున్నదన్నారు. చండ్ర రాజేశ్వరరావు, నీలం రాజశేఖరరెడ్డి, దాసరి నాగభూషణరావు, గిరిప్రసాద్‌, రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య లాంటి ఎందరో యోధులు కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం కృషి చేశారన్నారు. సాయుధ పోరాటం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. ఈ దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీకి ఎటువంటి స్థానం లేదని, పైగా వలస వాదులతో రాజీపడ్డారని విమర్శించారు. 1925లో పార్టీ ఆవిర్భవించినప్పుడు బ్రిటిష్‌ రాజ్యం ఉంటే ఇప్పుడు వందేండ్ల తర్వాత బీజేపీ రాజ్యం నడుస్తుందన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్షాల ముందు మూడు ప్రధాన సవాళ్లు ఉన్నాయన్నారు. ఒకటి మతం, రెండు ఆర్థిక అసమానతలు, మూడు కుల నిర్మూలన అని వీటన్నింటిని ఒక పక్క రాజకీయంగా, మరో పక్క ప్రజలను చైతన్యపరుస్తూ ఎదుర్కొవాలన్నారు. త్వరలో జరగబోయే కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం ఎన్నికల్లో వామపక్షాలు.. ప్రస్తుత కేరళ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే మిగిలిన రాష్ట్రాల్లో బలపడాలన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మిక వర్గం, మహిళలు, సబ్బండ వర్గాల ప్రజల ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయని స్పష్టం చేశారు. వామపక్షాల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయమని, ఆ దిశగా కలిసి పనిచేస్తామని తెలిపారు.

మారని, మాసిపోని సిద్ధాంతం కమ్యూనిజం : దేవరాజన్‌
మారని మాసిపోని సిద్ధాంతం కమ్యూనిజమని, మారుతున్న కాలానికి అనుగుణంగా పనిచేయడం ద్వారా అద్భుత విజయాలను సాధించవచ్చని అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్‌ తెలిపారు. పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వామపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వామపక్షాలన్నీ కేంద్రీకృతమై ఒక ఎజెండాతో పనిచేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. సెక్యులర్‌ శక్తులతో కలిసి పనిచేసేటప్పుడు కూడా వామపక్ష ఐక్యతను ప్రదర్శించాలని తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఆహుతులను వేదికపైకి ఆహ్వానించగా ఈ సెమినార్‌లో.. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్‌ జిత్‌ కౌర్‌, గిరీష్‌ శర్మ, రామకృష్ణపాండే, సంజరు కుమార్‌, కె. ప్రకాష్‌ బాబు, పల్లవ్సేన్‌ గుప్తా, కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దేశ సంపద కార్పొరేట్లకు ధారాదత్తం: దీపాంకర్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తూ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నదని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య విమర్శించారు. రక్షణ, అణుశక్తి రంగాలను కూడా ప్రయివేటీకరించడం వెనక కార్పొరేట్‌ శక్తుల ఒత్తిడే కారణమని తెలిపారు. బీజేపీ ఓట్ల తొలగింపు ప్రక్రియ వెనక అతిపెద్ద కుట్ర ఉందని అన్నారు. ఒక్క బెంగాల్లోనే 60 లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు. హిట్లర్‌ తొలుత ఎన్నికల ద్వారానే అధికారంలోకి వచ్చారని, తర్వాత రాజ్యాంగాన్ని మార్చి నియంతగా మారాడని.. ఇప్పుడు మోడీ పలుకుతున్న ఒకే దేశం-ఒకే నాయకుడు-ఒకే పార్టీ ఆలోచన కూడా హిట్లర్‌ లాంటిదేనని అన్నారు. ఫాసిస్టు శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలే ఎజెండాగా వామపక్షాలు పనిచేయాలని, సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గంతో పాటు రైతులు, మహిళలు, ఉద్యోగులు అందరిని కలుపుకుని ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -