Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఓట్ల గల్లంతుతో ప్రజాస్వామ్యం అపహాస్యం

ఓట్ల గల్లంతుతో ప్రజాస్వామ్యం అపహాస్యం

- Advertisement -

బీహార్‌లో ఓట్ల తొలగింపు రాజ్యాంగ విరుద్ధం
సర్‌తో దేశమంతటా విస్తరించేందుకు
కేంద్రం కుట్ర : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం

బీహార్‌లో ప్రతిపక్షాలు, మైనార్టీల ఓట్లను గల్లంతు చేయడానికే ఓటు సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ విధానాన్ని తీసుకొచ్చిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్‌లో సోమవారం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అధ్యక్షతన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహార్‌లో అధికారంలోకి రావడం కోసం తమకు వ్యతిరేకంగా ఓట్లు పడతాయనుకున్న వారి ఓట్లను తొలగించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం దానికి తొత్తుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ప్రకటనలు కూడా అలానే ఉంటున్నాయని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక సమగ్ర సవరణ విధానం బీహార్‌ ఒక్కదానికే పరిమితం కాదని, రేపు భారత దేశమంతటా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నకిలీ ఓటర్లను తొలగించడం మాత్రమే కాదని, రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును తొలగించడమని స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు, భారత రాజ్యాంగాన్ని రక్షించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటు సవరణ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విధానం ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. ప్రజల ఓటు హక్కును కాలరాస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కలిసి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మోడీ, ట్రంప్‌ ఇద్దరూ స్నేహితులే అయితే భారత్‌పై పదేపదే సుంకాలు ఎందుకు విధిస్తున్నారో..? దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమెరికా- భారత్‌ వాణిజ్యంలో భాగంగా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షులు ప్రకటించినా మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, స్వావలంబనను అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నింటిలో ప్రత్యేకించి అమెరికాలో కూడా నిరసన వెల్లువలు కొనసాగుతున్నాయని, ఇది శుభ పరిణామమని అన్నారు. ప్రజా తిరుగుబాటులో సామ్రాజ్యవాద పెట్టుబడుదారీ శక్తులు తోక ముడవక తప్పదని హెచ్చరించారు.

వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం
రాష్ట్రంలో వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమ్మినేని కోరారు. జిల్లా కేంద్రం ఆస్పత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను ఏర్పాటు చేసి సరిపడా మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నుంచి ఏజెన్సీ ప్రాంత ప్రజలను కాపాడటానికి తగిన సౌకర్యాలు కల్పించడంతోపాటు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మీడియం బాబురావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.జ్యోతి, ఎంబి.నర్సారెడ్డి, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad