Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంతక్షణమే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి

తక్షణమే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి

- Advertisement -

నేపాల్‌ సంక్షోభంపై సీపీఐ(ఎం) విచారం
న్యూఢిల్లీ : పొరుగుదేశమైన నేపాల్‌లో జడ్‌ జనరేషన్‌ యువత చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో 20మంది మరణించడం పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ సమస్యలను పరిష్కరించడంలో, తమ ఆకాంక్షలను నెరవేర్చడంలో వరుసగా ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నిరాశా నిస్పృహల నుంచి పెల్లుబికిన ఆగ్రహావేశాలను ఈ నిరసనలు ప్రతిబింబిస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. పాలక వర్గాల్లో విశృంఖలమైన అవినీతి, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, యువతకు కొరవడుతున్న ఉపాధి అవకాశాలు ప్రధానంగా జెన్‌ జెడ్‌ నిరసనలకు కారణాలుగా వున్నాయి. సామాజిక మాధ్యమాలపై నేపాల్‌ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్కసారిగా ఈ నిరసనలు తలెత్తాయి. కె.పి.ఓలి ప్రభుత్వం రాజీనామా చేయడంతో శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగించాలి. ప్రముఖ రాజకీయ నేతలపై మూక హింస పెచ్చరిల్లిన తరుణంలో ఈ చర్యలు మరింత అవసరం. ముఖ్యంగా మాజీ ప్రధాని జలనాథ్‌ ఖనాల్‌ భార్య రాజ్యలక్ష్మి చిత్రార్కర్‌ను హతమార్చడమన్నది ఖండించదగిన చర్య అని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది. నేపాల్‌ యువతకు గల ఆందోళనలు, వారి ఫిర్యాదులను తక్షణమే వినాల్సిన అవసరం ఎంతైనా వుంది. వాటిని పరిష్కరించేందుకు వెంటనే సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో, నేపాల్‌ రాజరికానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం, ఎంతో కఠినంగా సాగిన పోరాటాలనంతరం సాధించుకున్న రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామ్య, లౌకికవాద విలువలను పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులను రాచరికవాదులు, ఇతర ప్రతీఘాత శక్తులు అవకాశంగా తీసుకుని దుర్వినియోగం చేయకుండా దేశంలోని యువత, ప్రజాస్వామ్య శక్తులు అప్రమత్తంగా వుండాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ సామూహిక నిరసనలు, ఆందోళనల ఫలితం ప్రజాస్వామ్య పునరుద్ధరణగా వుండాలి తప్పితే ఫ్యూడల్‌ నిరంకుశవాద పాలనను పునరుద్ధరించరాదని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -