Sunday, October 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండ్లను కూల్చటం చట్ట ఉల్లంఘనే

ఇండ్లను కూల్చటం చట్ట ఉల్లంఘనే

- Advertisement -

బుల్డోజర్‌ పాలనతో కాదు.. చట్టబద్ధ పాలనతో దేశ న్యాయవ్యవస్థ
సీజేఐ జస్టిస్‌ బిఆర్‌ గవాయ్
ఆర్టికల్‌ 21 ప్రకారం ఆశ్రయం పొందటం ప్రాథమిక హక్కు

పోర్ట్‌ లూయిస్‌ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్ కీలకవ్యాఖ్యలు చేసారు. భారత న్యాయవ్యవస్థ బుల్డోజర్‌ పాలనతో కాకుండా చట్టబద్ద పాలన ద్వారా పని చేస్తుందన్నారు. ”అతి పెద్ద ప్రజాస్వామ్యంలో చట్ట పాలన ” అనే అంశంపై మారిషస్‌లో జరిగిన ఒక సదస్సులో సీజేఐ మాట్లాడుతూ విచారణ, చట్టపరమైన ప్రకియ లేకుండా ఇండ్లను కూల్చడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ఆశ్రయం పొందటం, నివసించడం పౌరుల ప్రాథమిక హక్కు అని వివరించారు. నిర్థారణ కాకుండా నిందితుల ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని, తాను ఇచ్చిన తీర్పుతో ఇండ్ల కూల్చివేతను నిలుపు చేసామని ఆయన గుర్తు చేశారు.

న్యాయమూర్తి ఒకేసారి జ్యూరీ, ఉరిశిక్షకుడిగా వ్యవహరించలేరన్నారు. భారత రాజ్యాంగం అమల్లో ఉన్న ఈ 75 సంవత్సరాల్లో చట్ట నియమం అనే భావన చట్ట గ్రంధాలకు మించి అభివృద్ధి చెంది సామాజిక, రాజకీయ రంగాల్లో ఒకే విధంగా వ్యాపించిందని విశ్లేషించారు. చట్ట పాలన అనేది కఠినమైన సిద్ధాంతం కాదని, పార్లమెంట్‌, ప్రజలు, దేశాల చరిత్ర మధ్య అనేక తరాలుగా జరిపే సంభాషణగా అభివర్ణించారు. మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌లను ప్రస్తావిస్తూ దేశ చట్టబద్ద పాలనలో వారి దృక్పథం అంతర్లీనంగా కనిపిస్తుందన్నారు. అధికారంలో ఉన్నవారితో సహా ప్రతి వ్యక్తీ చట్టాన్ని పాటించాలన్నారు. ఈ సదస్సులో మారిషస్‌ అధ్యక్షులు ధరంబిర్‌ గోఖుల్‌, ప్రధాన మంత్రి నవీన్‌ చంద్ర, ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి రెహానా ముంగ్లి గుల్బుల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -