శాంతినగర్‌లో ఫారెస్ట్ అధికారుల దాడులు
బాధతో క్రిమిసంహారక మందు తాగిన బాధితుడు
చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
ములుగు జిల్లా మంగపేట మండలంలో ఘటన
నవతెలంగాణ-మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపల్లి-మంగపేట గ్రామాల మధ్యనున్న అడవిలో గుత్తి కోయ గూడెం అయిన శాంతినగర్ వరుసగా ఫారెస్ట్ అధికారుల దాడులతో తల్లడిల్లుతోంది. అడవే ఆధారంగా జీవించే గుత్తికోయలు ప్రస్తుతం నివశిస్తున్న గుడిసెల్లో నీటి ఊట వచ్చి ఉండలేకపోతున్నారు. దాంతో పక్కనే పోడు కొట్టి కొత్తగా గుడిసెలు వేసుకున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులు జరిపారు. శుక్రవారం ఫారెస్ట్ రేంజ్ అధికారి అశోక్, డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు శాంతినగర్‌లో దాడులు జరిపి గుత్తికోయల గుడిసెలను కూల్చి వేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి నిర్మించుకున్న గుడిసెలను అకస్మాత్తుగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి కూల్చి వేస్తుండటంతో గుండెలవిసేలా గుత్తికోయ మహిళలు, పిల్లలు రోదిస్తూ తమ బతుకులను కూలదోయకండనీ వేడుకున్నారు.
కాగా, ఫారెస్ట్ అధికారులు గుడిసెలను కూల్చుతున్న క్రమంలో శాంతినగర్‌కు చెందిన సోయం సురేష్ అనే వ్యక్తి తన కెమెరాతో ఫోటోలు తీస్తుండగా ఫారెస్ట్ అధికారులు లాక్కున్నారు. ఆగ్రహానికి గురైన సురేష్ తన మొబైల్ తనకు ఇవ్వాలని, గుడిసెలు కూల్చడం ఆపాలని, లేకపోతే క్రిమిసంహారకమందు తాగి చనిపోతానంటూ పొలాల వైపు పరుగులు తీశారు. కొంత సమయం తర్వాత పురుగుమందు డబ్బాతో తిరిగి వచ్చిన సురేష్ తాను పురుగుల మందు తాగానని చనిపోబోతున్నానని ఫారెస్ట్ అధికారుల జీప్‌కు అడ్డంగా పడుకున్నాడు. తిరిగి వెళ్ళిపోతున్న ఫారెస్ట్ అధికారుల వాహనాలను ఎక్కి నానా హైరానా చేస్తూ అధికారులను వెంబడించాడు. ఈక్రమంలో శాంతినగర్ సమీపంలోని వాగు వద్ద సురేష్ స్పృహ తప్పి పడిపోగా గ్రామస్తులు అతడిని మందు కక్కించే ప్రయత్నం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఏటూరు నాగారం సామాజిక ఆరోగ్య కేంద్రానికి సిఫార్సు చేసినట్టు ఆస్పత్రి వైద్యాధికారి స్వప్నిత తెలిపారు. సురేష్ మెరుగైన చికిత్స అందించడం కోసం ఏటూరు నాగారం నుంచి ములుగు జిల్లా కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్టు సమాచారం. కాగా, బతుకు పోరు సాగించడానికి సుమారు 13 సంవత్సరాల క్రితం రాష్ట్రం దాటి వలసొచ్చిన గుత్తికోయలు.. మంగపేట-కోమటిపల్లి గ్రామాల మధ్య అడవిలోని వారి గూడెం పెద్ద మంగు ఆధ్వర్యంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలో గుత్తికోయలు పోడును విస్తరిస్తున్నారని పలుమార్లు ఫారెస్ట్ అధికారులు శాంతినగర్ పై దాడులు చేసి హెచ్చరించారు. ఇటీవలి కాలంలో గుత్తికోయలు ప్రస్తుతం ఉంటున్న గుడిసెల్లో నీటి ఊట వస్తుందని, అడవిని ఆనుకొని పోడుచేసి నూతన గుడిసెలను నిర్మించుకు న్నారు.
ఈ విషయంలో ఆగ్రహించిన ఫారెస్ట్ అధికారులు.. కొన్ని రోజుల క్రితం శాంతినగర్‌పై దాడులు జరిపి గుడిసెలను కూల్చి వేశారు. ఈ సంఘటనపై స్పందించిన సీపీఐ(ఎం) నాయకులు, స్థానిక పోలీసులు ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరిపారు. కొన్నేండ్లుగా ఇక్కడే జీవిస్తున్న గుత్తి కోయలను ఉన్న పళంగా వెళ్ళమంటే వెళ్ళలేరని, వారికి శాశ్వత నివాసాలు ఏర్పరుచుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఫారెస్ట్ అధికారుల నుంచి శాశ్వత గృహ నిర్మాణం కోసం అనుమతులు వచ్చేవరకు నూతన పోడు చేయకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకోవచ్చనే ఒప్పందాన్ని ఇరువురి మధ్య కుదిర్చారు. నాటినుంచి ప్రశాంతంగా ఉన్న శాంతినగర్‌లో ఫారెస్ట్ అధికారులు మళ్లీ దాడులు చేయడం కలకలం రేపింది. గుత్తి కోయలు వేసుకున్న గుడిసెలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. ఫారెస్ట్ అధి కారులు చేసిన దాడుల వల్ల పిల్లా పాపలతో ఎక్కడుం డేదని మహిళలు.. రోదించిన తీరు వర్ణనాతీతం.
అటవీ విధ్వంసానికి పాల్పడుతున్నందునే చర్యలు ఫారెస్ట్ రేంజ్ అధికారి అశోక్
శాంతినగర్‌లోని గుత్తి కోయలు అడవిలోని మహావృక్షాలను నేలమట్టం చేయడమే కాక అడవిని ఆనుకొని నూతన పోడును చేస్తూ అటవీ విధ్వంసానికి పాల్పడుతున్నందునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్ట్ రేంజ్ అధికారి అశోక్, డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వరరావు తెలిపారు. వారు గతంలో కంపార్ట్‌మెంట్ నెంబర్ ఐదులో సుమారు ఐదు నుంచి ఆరు ఎకరాల విస్తీర్ణంలో పోడు చేసి గూడెంలోని అందరూ గుడిసెలను నిర్మించుకున్నారని, వారు ఆ గుడిసెల్లో ఉంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అయినా తమ మాటలను లెక్కచేయక మరో ప్రాంతంలో అడవిని ఆనుకుని సుమారు 18 హెక్టార్లలో అడవిని ధ్వంసం చేసి పోడు కొట్టి కొత్తగా గుడిసెలు నిర్మిస్తున్నారని, ఆ క్రమంలోనే పై అధికారుల ఆదేశాల మేరకు తమ విధులను తాము నిర్వర్తిస్తున్నామని వెల్లడించారు.