సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
పసర చౌరస్తా మెుద్దులగూడెం రోడ్డు ప్రధాన కూడలికి ఆనుకొని ఉన్న ఇల్లు అర్ధరాత్రి ఆర్ అండ్ బి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు ఒత్తిడి మేరకు దౌర్జన్యంగా ఇల్లు కూల్చి వేయడం అన్యాయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు, మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి అన్నారు.
గురువారం పసర సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి మెుద్దులగూడెం రోడ్డుకు చౌరస్తా దగ్గరలో గల ఇంటిని (5-80 )నందు గత 60 సంవత్సరాలుగా అమీన్ బీ అనే ముస్లిం మహిళ నివాసం ఉంటు.. ఆ ఇంటిలో ముగ్గురు చిరు వ్యాపారులు జీవనోపాధి పొందేవారని తెలిపారు.
అట్టి ఇంటిని అర్ధరాత్రి అధికారులు అక్రమంగా కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. కూల్చివేత ద్వారా ముగ్గురు జీవనోపాధి కోల్పోయారని ఆమె ఆవేదన చెందారు. ఈ కూల్చివేతతో కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణంలో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారని, గోల్డ్ షాప్ లో ఉన్న 10 తులాల వెండి, ఐదు గ్రాముల బంగారు కమ్మలు పోయాయని తెలిపారు. ఒక వికలాంగురాలు కుట్టు మిషన్ బట్టలు పనికిరాకుండా పోయాయని తెలిపారు. అరటి పండ్ల వ్యాపారి పండ్లు రోడ్లపై పడవేశారని వారి జీవన భృతిని నాశనం చేశారని అన్నారు. జీవనోపాధి దెబ్బతీశారని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
అడ్డుకున్న చిరు వ్యాపారులను భయబ్రాంతులకు గురి చేశారని, జెసిబితో చిరు వ్యాపారుల మీదికి తీసుకువచ్చి హత్యాయత్నం చేశారని అన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులే కొద్దిమంది స్వార్ధపరుల ప్రయోజనాల కోసం ఇలా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. జీవించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతీసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పు పేరుతో ఇండ్లను కూల్చివేయడం అభివృద్ధి పేరుతో పేదలను రోడ్డు మీదకి నెట్టడం వారి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.
కేవలం ఒక షాప్ యజమాని కోసం అధికార యంత్రాంగం లాలూచీపడి ఈ తతంగం నడిపిందని విమర్శించారు. కొంతమంది మధ్య దలారీలను ఏర్పాటు చేసుకొని జిల్లా అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారిని బలి చేశారని తెలిపారు. అధికారులు ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిపారు. కోర్టు ఆర్డర్ చదివారా అని ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్లో ఏముందో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సదరు నివాసితులకు మూడు నోటీసులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు.
అందులో ఉంటున్న వారికి పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే డిస్మెంటల్ చేయాల్సి ఉన్నా.. ఎందుకు ఆవేశపడి అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనక అంతర్గత ఉద్దేశం ఏమిటని వారు అన్నారు. ఈ ప్రాంతంలో నిరుపేదలు ఎన్నో సంవత్సరాలు నుండి రోడ్డు పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని, ఈ వ్యవహారంతో వారందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం నష్టపోయిన వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
వికలాంగురాలకి కుట్టు మిషన్ అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



