నవతెలంగాణ- కాటారం
ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ శివారులో జరిగిన భూ ఆక్రమణ ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన పొట్ట పోచం అనే వ్యక్తి అక్రమంగా భూమిని కబ్జా చేసి గృహ నిర్మాణం చేపట్టిన విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమికి సంబంధించి సర్వే నిర్వహించి, అసలు యజమానిని గుర్తించారు. అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ, పోలీసు శాఖ సహకారంతో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చివేశారు.
అధికారులు స్పష్టం చేస్తూ, భూములను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో చట్టం ముందు అందరూ సమానమనే సందేశాన్ని ఈ చర్య ద్వారా అధికారులు ఇచ్చారు.



