Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం9న ప్రదర్శనలు, ధర్నాలు

9న ప్రదర్శనలు, ధర్నాలు

- Advertisement -


– సమ్మెకు మద్దతుతోపాటు రైతుల డిమాండ్లపై ఆందోళనలు: ఎస్‌కేఎం పిలుపు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఈనెల 9న జరగనున్న అఖిల భారత సమ్మెకు మద్దతు ఇస్తూనే… రైతాంగ డిమాండ్లపై ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. సమ్మెను విజయవంతం చేయాలని కోరింది. గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఎస్‌కేఎం జాతీయ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్‌, పశ్య పద్మ, విస్సా కిరణ్‌ కుమార్‌, భిక్షపతి, వి. ప్రభాకర్‌, జక్కుల వెంకటయ్య తదితరులు విలేకర్లతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఉమ్మడి కార్యక్రమం చేపట్టిన కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చా అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. అమెరికాతో భారత్‌ చేసుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందంతో దేశ రైతాంగానికి విఘాతమని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతాంగం అనేక ఏండ్లుగా ఉద్యమాలు చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం లేదని విమర్శించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం పంట సాగు ఖర్చులకు 50శాతం కలిపి ఎంఎస్పీ నిర్ణయించకుండా ఖర్చులను తగ్గించి చూపిస్తున్నదని చెప్పారు. నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానంలో ఎంఎస్పీ ఊసే లేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని అటకెక్కించిందని చెప్పారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు భారత వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. రైతులు అప్పుల ఊబిలో పడకుండా తక్షణమే ‘రైతు రుణ విమోచన చట్టం’ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పదేండ్లలో కార్పొరేట్లకు రూ. 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందనీ, రైతులకు మాత్రం మాఫీ చేయడం లేదని చెప్పారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించబడిన హక్కులకు విఘాతం కలిగిస్తూ చట్ట సవరణలు చేయటమేకాక, ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో వందలాది ఆదివాసీలను చంపివేస్తున్నదని చెప్పారు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఐక్య పోరాటాలతో కార్మిక వర్గం సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను, ప్రయోజనాలను పారిశ్రామిక వేత్తలకు పణంగా పెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న అఖిల భారత సమ్మె, దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూఢ్‌ శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -