– విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థీ అభ్యసనా ఫలితాలను సాధించేలా చూడాలని జిల్లా విద్యాధికారుల (డీఈవో)ను విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కోరారు. పాఠశాలలను సందర్శించి తరగతి గదిలో బోధనను పరిశీలించాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో విద్యా నాయకత్వం, విద్యాశాఖ కార్యక్రమాలపై డీఈవోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్జేడీలు, ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్, సీటీఈ ప్రిన్సిపాల్, డీఈవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు లక్ష్యాత్మకంగా జరిగేలా చూడాలని కోరారు. డీఈవోలు విద్యా నాయకులుగా జిల్లా విద్యా బాధ్యతలను నిర్వహించి ప్రగతి సాధించేలా చూడాలని అన్నారు. ప్రతి అంశం విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠశాల బోధన జరిగేలా చూడాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రభావితం చేసినట్టుగా మరెవరూ చేయలేరని అన్నారు. ఉపాధ్యాయులు ప్రభావవంతంగా బాధ్యతలను నిర్వహించేలా డీఈవోలు చూడాలని కోరారు. పాల నుంచి నెయ్యి తీసినట్టుగా విద్యార్థుల్లోని నైపుణ్యాలను, అంతర్గత శక్తులను వెలికితీసేలా కృషి చేయాలని సూచించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ మాట్లాడుతూ తరాలు మారినకొద్దీ అంతరం ఉంటుందని అన్నారు. వాస్తవిక ప్రపంచానికి ఊహా ప్రపంచానికి మధ్య తేడాను గుర్తించనంతగా సోషల్ మీడియా పిల్లల్లో ప్రభావం చూపుతుందన్నారు. విద్యార్థులకు తెలియకుండానే ఫోన్ ద్వారా సైబర్ నేరాలకు లోనవుతున్నారని వివరించారు. పెద్దవాళ్లకు తెలియకుండా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారనీ, అమ్మాయిలు మోసపోతున్నారని అన్నారు. పోక్సో చట్టం, ఐటీ చట్టంపై అందరికీ అవగాహన ఉండాలని చెప్పారు.
డీఈవోలు బడుల్లో బోధనను పరిశీలించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES