ఎంహెచ్‌ఎస్‌ఆర్బీకి టీయుఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలో పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ కోఠిలోని మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయంలోని అధికారి చంద్రశేఖర్‌రావును టీయుఎంహెచ్‌ఇయూ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్ నాయకత్వంలో అభ్యర్థులు కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది అభ్యర్థులు పారామెడికల్ పోస్టుల కోసం పరీక్షలను రాసి 7 నెలలు గడిచినా మెరిట్ లిస్ట్ ఇవ్వలేదనీ, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్యశాఖలో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టిందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని నియామకాలను కూడా పూర్తి చేశారని గుర్తుచేశారు. గతేడాది నవంబర్‌లో వివిధ రకాల పారామెడికల్ పోస్టుల భర్తీ చేపట్టారని తెలిపారు. వీటిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 1,284, నర్సింగ్ ఆఫీసర్లు 2,322, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 732తో పాటు గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) పోస్టులు 1,931తో కలుపుకుని మొత్తం 6,269 పోస్టులున్నాయని చెప్పారు.
వీటితో పాటు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల పోస్టులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ఈ నియామకాలకు సంబంధించి రాతపరీక్షలను నిర్వహించి కీ విడుదల చేశారని పేర్కొన్నారు. అయితే ప్రొవిజనల్, ఫైనల్ మెరిట్ లిస్టులు విడుదల చేసి త్వరగా నియామకం చేపట్టాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు, నిరుద్యోగులు కోరుతున్నారని తెలిపారు. 15 రోజుల్లోగా అన్ని నియామకాలను పూర్తి చేయాలనీ, లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
మే 26న…
ల్యాబ్ టెక్నీషియన్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్
ఈ నెల 26న ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్టు బోర్డు కార్యాలయంలో అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు. అదే విధంగా ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్), ఫార్మాసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్లు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల లిస్ట్‌ను కూడా త్వరలోనే పెట్టనున్నట్టు హామీ ఇచ్చారు.
వైద్యారోగ్యశాఖలో నియామక ప్రక్రియనుత్వరగా పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES