సింగరేణి భవన్ ముట్టడికి యత్నం..కవిత అరెస్ట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలనీ, తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని తదితర డిమాండ్లతో తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లక్‌డీకపూల్‌లో గల సింగరేణి భవన్ ముట్టడికి కల్వకుంట్ల కవిత యత్నించారు. ఈ సందర్భంగా గేట్ ముందు ప్ల కార్డు పట్టుకుని బైటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆమె నినాదాలు చేశారు. సింగరేణి సమస్యలను పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేసి, కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను ఆపాలన్నారు. సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందనీ, 10 శాతం వాటా కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి భవన్‌ను కవిత మట్టడిస్తుందన్న సమాచారంతో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. పోలీసుల కళ్లుగప్పి ఆమె ఆటోలో సింగరేణి భవన్‌కు చేరుకుంది. ఈక్రమంలో.. కవితతో పాటు హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సహా పలువురు నాయకులను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు



