Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంటీఎస్‌ ఎస్పీడీసీఎల్‌కు రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయండి

టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌కు రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయండి

- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)కు నెల రోజుల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం)ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గీతం ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ అనే కోణాన్ని దష్టిలో పెట్టుకొని, మధ్యంతర వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఇరుపక్షాల హక్కులకు భంగం వాటిల్లకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించింది. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌కు డబ్బులు చెల్లించాల్సిందే అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై గీతం యాజమాన్యం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ పై సోమవారం జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గీతం తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్యాం దివన్‌, చల్లా కోదండరాం, వై రాజగోపాల రావు, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు.

సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: గీతం తరపు న్యాయవాది
తొలుత గీతం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… ”గతంలో గీతం యాజమాన్యం ఆధీనంలోనే ‘వీబీసీ ఫెర్రో ఎల్లాయిస్‌’ కంపెనీ ఉండేది. ఆ తర్వాత క్రమంలో దానిని ఇతరులకు విక్రయించారు. అయినప్పటికీ ఆ కంపెనీ విద్యుత్‌ బకాయిలను గీతం యాజమాన్యమే చెల్లించాలని విద్యుత్‌ సంస్థ నోటీసులు జారీ చేసింది. ఇది సరికాదు. విద్యుత్‌ చట్ట నిబంధనలకు విరుద్దం. విద్యుత్‌ సంస్థ ఏ మాత్రమూ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని బకాయిలను లెక్కించలేదు. పైగా మా వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే నోటీసు జారీ చేసింది.

ఇది ముమ్మాటికీ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.” అని పేర్కొన్నారు ఈ వాదనలతో పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం… ‘సామరస్యతను పాటించాలనే ఉద్దేశంతోనే గీతం సంస్థ రూ. 15 కోట్ల మొత్తాన్ని విద్యుత్‌ సంస్థ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలు కేవలం మధ్యంతర ఉత్తర్వులకు మాత్రమే పరిమితమని, అవి కేసు తుది మెరిట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపవని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, ఈ నగదు డిపాజిట్‌ అనేది ఉభయ పక్షాల హక్కులకు భంగం కలగకుండా చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. అలాగే, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రధాన రిట్‌ పిటిషన్‌ ను త్వరితగతిన విచారించి, పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టును సూచించింది.

ఈ కేసు పూర్వాపరాలు..
వీబీసీ ఫెర్రో అలాయస్‌ సంస్థ నుంచి గీతం యూనివర్శిటీ గతంలో భూములను కొనుగోలు చేసింది. అయితే, వీబీసీ సంస్థ విద్యుత్‌ శాఖకు భారీగా బకాయిలు పడింది. వీబీసీ చెల్లించాల్సిన రూ.118 కోట్ల బకాయిలను, ఆ సంస్థ ఆస్తులు కొనుగోలు చేసిన గీతం విద్యాసంస్థనే చెల్లించాలంటూ టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఆ నోటీసులను గీతం తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేసింది. అయితే…ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రూ.54 కోట్లు చెల్లించాల్సిం దేనని గీతం యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీన గీతం యాజమాన్యం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -