Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయండేరా బాబాకు మళ్లీ పెరోల్‌

డేరా బాబాకు మళ్లీ పెరోల్‌

- Advertisement -

ఆరేండ్లలో 15వ సారి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ బయటకు..
లైంగికదాడి, హత్య కేసుల్లో 20 ఏండ్ల శిక్ష
ఢిల్లీ ఎన్నికల వేళ మరోసారి 40 రోజుల వెసులుబాటు
జైలు కంటే ఆశ్రమంలోనే ఎక్కువగా గడిపిన వైనం

న్యూఢిల్లీ: లైంగికదాడి, హత్య వంటి తీవ్రమైన నేరాల్లో దోషిగా తేలి, 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ మరోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఆయనకు మరో 40 రోజుల పెరోల్‌ను బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం మంజూరు చేసింది. గడిచిన ఆరేండ్లలో (2020 నుంచి) ఆయనకు జైలు నుంచి తాత్కాలిక ఊరట లభించడం ఇది 15వ సారి కావడం గమనార్హం. అయితే రామ్‌ రహీమ్‌కు జైలు గేట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకుంటున్నాయని సిక్కు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15వ సారి విడుదల
రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్‌ రహీమ్‌ తరచూ పెరోల్‌పై బయటకు వస్తున్నారు. ప్రస్తుతం 40 రోజుల పెరోల్‌ మంజూరైంది. గత ఏడాది ఆగస్టులో కూడా ఆయనకు 40 రోజుల పెరోల్‌ ఇచ్చారు. అంతకుముందు ఏప్రిల్‌లో 21 రోజులు బయటకు వచ్చారు. గత ఏడాది జనవరిలో 30 రోజులు పెరోల్‌ తీసుకున్నారు. ఇలా 2020 నుంచి ఇప్పటివరకు మొత్తం 15 సార్లు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

ఎన్నికల టైం లోనే…
ఇప్పుడు ఎన్నికలు లేనప్పటికీ, గతంలో ఆయన విడుదలైన సమయాలను పరిశీలిస్తే, అవి కచ్చితంగా ఎన్నికల కోసమేనని అర్థమౌతోంది. 2025 ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు, జనవరిలో ఆయనకు 30 రోజుల పెరోల్‌ లభించింది. 2024 అక్టోబర్‌ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు (అక్టోబర్‌ 1న) ఆయన 20 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చారు. 2022 ఫిబ్రవరిలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు ఆయనకు మూడు వారాల బెయిల్‌ లభించింది. ఇలా కీలకమైన ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆయన బయట ఉంటూ, ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇదీ నేర చరిత్ర
గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ నేపథ్యం నేరమయమైంది. ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నది సాధారణ కేసుల్లో కాదు. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళా అనుచరులపై లైంగికదాడి చేసిన కేసులో 2017లో కోర్టు ఆయనకు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 16 ఏండ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో కూడా 2019లో ఆయన దోషిగా తేలారు. డేరా చీఫ్‌తో పాటు మరో ముగ్గురికి ఈ హత్య కేసులో శిక్ష పడింది.

యూపీ ఆశ్రమంలోనే మకాం
జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ ఆయన తన ప్రధాన కేంద్రమైన హర్యానాలోని సిర్సాకు వెళ్లడం మానేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లాలో ఉన్న డేరాకు చెందిన బర్నావా ఆశ్రమంలో గడుపుతున్నారు. గతంలో బయటకు వచ్చిన 13 సందర్భాల్లోనూ ఆయన ఇక్కడే ఎక్కువ రోజులు ఉన్నారు. హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో డేరాకు భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. సిర్సా, ఫతేహాబాద్‌, కురుక్షత్ర, కైథాల్‌, హిసార్‌ జిల్లాల్లో ఆయన ప్రభావం ఎక్కువ.

చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు
హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ వంటి సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తికి ఇన్నిసార్లు పెరోల్‌ ఇవ్వడం చట్టాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దోషులను కాపాడుతున్నదని విమర్శిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -