అలీసాగర్ అడవుల్లో చిక్కీ అనే జింక ఉండేది. అది చాలా తెలివైనది, అందరితో కలిసిమెలిసి ఉండేది. ఒకరోజు చిక్కీ తన స్నేహితులతో అడవిలో ఆడుకుంటూ, ఒకచోట నరికివేసిన చెట్లను చూసింది.
‘అయ్యయ్యో… ఏంట్రా ఇది? ఆ చెట్లు నరికింది ఎవడు?’ అని చిక్కీ గట్టిగా అరిచింది.
‘చిల్, బ్రో.. ఆ సౌండ్ విను. ఏదో జరుగుతోంది’ అని దాని బెస్ట్ ఫ్రెండ్ కపి అనే కోతి చెప్పింది. ‘అవునవును’ అంటూ మిత్ర బృందం అంతా అటు వైపు దూసుకెళ్లింది. అక్కడ మనుషులు చెట్లను నరుకుతూ, యంత్రాలతో భూమిని చదును చేస్తూ కనిపించారు
‘అరె.. చూడండిరా.. ఇది మన అడవికి డేంజర్ బెల్స్ రా..’ అన్నది చిక్కీ. ఒక నిమిషం అంతా పరికించి చూశారు. ‘ఈ మనుషులు ఎంత సెల్ఫిష్?’ కోపంగా అన్నది కపి.
‘అవును, తమ స్వార్థం కోసం మన ఇంటిని నాశనం చేస్తున్నారు. దీనివల్ల జంతువులు, పక్షులు, చెట్లు, చివరికి భూమి కూడా ప్రమాదంలో పడుతుంది’ మిత్రులకు వివరించింది చిక్కీ. ‘అందరం కల్సి ఫైట్ చేద్దాం .. డీల్’ అన్నది కపి. ‘డీల్’ అని ఒక్కసారిగా అందరూ కేకలు వేశారు.
కపి సూపర్ స్మార్ట్ కోతి లీడర్‌గా మారింది. ‘మనకి ప్లాన్ కావాలి బ్రో! నేను స్ట్రాటజీ సెట్ చేస్తా…’ అన్నది కపి.
మరుసటి రోజు కోతులు చెట్లపై నుంచి గూఢచారిలాగా మనుషులను గమనిస్తూ ఉన్నాయి. రకరకాల పక్షులు, కుందేళ్లు మనుషుల రాకను ఎప్పటికప్పుడు తమ సంజ్ఞల ద్వారా విషయం అడవి అంతా చేరవేస్తున్నాయి.
అడవిని నరికి భూమిని చదును చేయడానికి భారీ ట్రక్కులు, యంత్రాలతో మనుష్యులు రానే వచ్చారు.
ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు రంగంలోకి దిగి అడ్డుకున్నాయి.
‘ఎవడు ముందుకొస్తాడో రండిరా.. చూద్దాం’ ఏనుగు ఘీంకరించింది.
ఊహించని పరిణామానికి మనుషులు భయపడ్డారు. ట్రక్కులు ఆపేసి కొంత సేపు తమ వాహనాలలో అట్లాగే ఉండిపోయారు.
జంతువులు కూడా అలాగే అడ్డంగా పడుకున్నాయి. వాహనాల లైట్లు వేశారు. హారన్ శబ్దం పెంచారు. అయినా అవి బెదరలేదు. ఉన్న దగ్గర నుంచి కదలలేదు.
ఇక లాభం లేదని వెనుదిరిగిన మనుషులు రాత్రిపూట చీకట్లో రహస్యంగా అడవిలోకి ప్రవేశించారు. శబ్దం రాని యంత్రాలతో పెద్ద పెద్ద వక్షాలు మొదలుకంటా కూల్చేయడం కపి గమనించింది. ‘గర్సు.. వీళ్ళు సీక్రెట్ మిషన్‌లో ఉన్నారు’ అంటూ ఇతర జంతువుల్ని అప్రమత్తం చేసింది.
కుందేళ్లు వలలు పరిచాయి. జింకలు వేగంగా మూకుమ్మడిగా వచ్చి దాడి మొదలుపెట్టాయి. ఏనుగు ట్రక్ ఎత్తి పక్కకు విసిరేసింది. అడవిదున్న మరో వాహనాన్ని తలకిందులు చేసింది.
వలలో చిక్కుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న మనుషుల్ని చూసి ‘సోదరులారా, మీరు మా నివాసమైన అడవిని ధ్వంసం చేసి మీ ఇల్లు బాగు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఈ అడవిలేకపోతే మీకు అవసరమైన ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరే ఆలోచించండి’ నిదానంగా అన్నది చిక్కీ.
‘మా తాత ముత్తాతలే కాదు వాళ్ళ తాత ముత్తాతలు, మా పూర్వీకులంతా ఈ అడవిలోనే పుట్టి, పెరిగి ఈ మట్టిలోనే కలిసిపోయారు. ఈ అడవి, ఈ నేల, ఈ గాలి మీ ఒక్కరివే అనుకుంటున్నారా? కాదు, సమస్త జీవకోటికి చెందినవి’ అన్నది కుందేలు
‘అడవి లేకపోతే స్టైల్‌గా నేను డాన్స్ చేసే ఫొటోలు ఎవరు తీస్తారు?’ సరదాగా అన్నది నెమలి.
ఇప్పుడు మీరొచ్చి మా నివాసాన్ని నాశనం చేస్తున్నారు. మేం వచ్చి మీ ఇంటిని ధ్వంసం చేస్తే.. బాధగా ఉంటుంది కదా? ఆ.. మాదీ అదే బాధ, అదే దుఃఖం’ అన్నది నక్క.
‘మీరు చాలా స్మార్ట్ అనుకుంటారు కదా? కూర్చున్న కొమ్మ కట్ చేసుకుంటే ఎవడు స్మార్ట్ అవుతాడు?’ అన్నది కపి.
మీ మనుషులైనా, మా అడవి బిడ్డలైనా ఎవరైనా సరే ఈ నేలపై ఉన్నంత వరకు వాడుకుని వదిలేయాల్సిందే. ఇక్కడ నీది నాది అని ఎవరూ సొంత దారులు కాదు’ ఘీంకరించింది ఏనుగు.
ఈ అడవితో మా బతుకులు మాత్రమే కాదు పోయేది, మీ బతుకు కూడా అని గుర్తించండి అని కొన్ని జంతువులు, పక్షులు భూమి ప్రాముఖ్యతను మెల్లగా అర్థమయ్యేటట్లు చెబుతుంటే మరికొన్ని తిట్ల వర్షం కురిపించాయి.
‘మీ మానవులు లేకపోయినా ఈ అడవిలో పశుపక్ష్యాదులు, జీవజాలం హాయిగా బ్రతకగలం. కానీ మేం లేకపోతే మీకు బతుకు లేదు. అది మర్చిపోయి విర్రవీగుతున్నారు’ ఉడుత హెచ్చరించింది.
అడవి జంతువుల మాటలు ఈటెల్లా తగులుతుంటే వచ్చిన మనుషులు విలవిలలాడుతున్నారు. ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. వాటి బలం ముందు మనుషులు తలవంచక తప్పలేదు. చివరకు మనుషులు తమ తప్పు తెలుసుకుని, ‘మేం స్వార్ధంగా వ్యవహరించాం. మమ్మల్ని క్షమించండి’ అని లెంపలేసుకున్నారు.
అడవిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, అప్పుడే మన భూమి సురక్షితంగా ఉంటుందని ఒప్పుకున్నారు. అడవిని నాశనం చేయడం మానేస్తామని మాట ఇచ్చారు. తమకోసం, తమ భవిష్యత్తు తరాల వారి కోసం మొక్కలు నాటడం మొదలు పెట్టారు. అడవి మళ్లీ పచ్చగా మారి సంతోషంగా పండుగ చేసుకుంది.
– వి. శాంతి ప్రబోధ
దిగొచ్చిన మనిషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES