పగిలిన అద్దంలా చెల్లాచెదురైంది గాజా
ఒక్కో హృదయం ఒక్కోచోట విలపిస్తున్నా
ఒక్కోకథ ఒక్కోలా ఉన్నా
కథ కథలో వ్యథ ఒకటే
ప్రతి మదిలో కన్నీటి సాంద్రత ఒక్కటే
సంద్రంలో నీరంతా అక్కడి ప్రవహించే కన్నీరే
రేగుతున్న ధూళంతా
కూలుతున్న అభాగ్యుల మరణయాతనే
వాకిలి ముందు నాలిక తడుపుకొంటున్న
మృత్యువు ఎంత తోలినా పోవటం లేదు
నిత్యం నిప్పులుకక్కే నింగే వాళ్ల శత్రువు
యుద్ధోన్మాదానికి సామ్రాజ్యవాదం తోడైతే
పూలవనాలు మరుభూములౌతాయనడానికి
నిలువుటద్దమే ఆ బతుకు చిత్రం
నీరింకిన బాల్యం బుగ్గలపై
నోరులేని ప్రశ్నలెన్నో చారికలు కడుతున్నారు
కరిగిపోయిన రంగుల కలలో
ఒక్క రంగైనా మిగిలుందేమోనని
శిథిలాల్లో అదేపనిగా అన్వేషిస్తున్నారు
కాలిపోయిన నవ్వుల పువ్వుల్లో
ఒక్క రేకైనా దొరుకుతుందేమోనని
బూడిద కుప్పల్లో పడి వెదుకుతున్నారు
అసలు యుద్ధం ఆకలితో ఆరంభమయ్యేక
కాలం సైతం జాలిగా స్తంభించిపోయి చూస్తోంది
ఆపన్నహస్తాలు కూడా అందుకోలేనంతగా
అహాన్ని శత్రువు గురిపెడుతోంటే
మరణం బోనులో, చేయని తప్పుకు
ముద్దాయై ఆక్రోశిస్తోంది
విజయంతో ఆగని యుద్ధం మరో అడుగేసి
జనహననం యుద్ధం ముసుగులో కానిస్తుంటే
నిస్సహాయంతో దు:ఖనదుల్లా సాగిపోతున్నారు
ఎంత జీవచ్ఛవాలైనా ప్రాణాలు కొడిగట్టేవరకైనా
ఒక జాతి అస్తిత్వ కణకణలు ఆరేవి కాదుగదా!
ఏ కాస్త ఆసరా దొరికినా మళ్లీ
ఎక్కడో అక్కడ మొలకెత్తక మానవు కదా!!
- భీమవరపు పురుషోత్తమ్, 9949800253