Monday, August 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు968 టీఎంసీల నీటి వాటాపై డిజైన్లు

968 టీఎంసీల నీటి వాటాపై డిజైన్లు

- Advertisement -

ఆ మేరకు నూతన ప్రాజెక్టుల నిర్మాణం
బనకచర్ల ప్రాజెక్టును అన్ని దశల్లో అడ్డుకుంటాం
తుమ్మిడి హెట్టి, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం
పత్తిపాక రిజర్వాయర్‌ డీపీఆర్‌ తయారీకి రూ.1.10 కోట్లు మంజూరు
3 బ్యారేజీలు లేకుండా రికార్డు స్థాయిలో
2.81 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి
రామగుండంలో ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటుకు కృషి : రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు, పొన్నం, అడ్లూరి
నవతెలంగాణ – గోదావరిఖని

గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉత్తమ్‌ ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా అంతర్గాం, ముర్ముర్‌, బ్రాహ్మణపల్లి, ఎల్లంపల్లి, సోమనపల్లి, మద్దిరాల, తొట్యాలపురం గ్రామాలకు, 17ఎల్‌ ద్వారా కుక్కలగూడూరు, నిట్టూరు గ్రామాలకు మొత్తం 13 వేల ఎకరాలకు పైగా నీరు అందుతుందన్నారు. పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణానికి డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) కోసం రూ.1.10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గత ప్రభుత్వం లక్ష కోట్లు వృథా చేసిందని, మూడు బ్యారేజీల మరమ్మత్తులు చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.

ఇచ్చంపల్లి, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీలు నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో రేషన్‌ ద్వారా సరఫరా చేసిన బియ్యం అక్రమ రవాణాకు గురయ్యాయని, ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా 3.17 కోట్ల మంది పేదలకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తున్నామని, రామగుండం ప్రాంతంలో అదనంగా 6,500 కార్డులు మంజూరు చేశామని అన్నారు. మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలను సరి చేస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంథని, పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణంతో 2.40 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ అవుతుందని, కొత్తగా 10 వేల ఎకరాలకు నీరందుతుందని తెలిపారు. రామగుండంలో ప్రయివేట్‌ పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని అన్నారు.లారీ యజమానుల సమస్యలు పరిష్కరించేందుకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. స్థానిక సింగరేణి ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్‌ చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని, అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా ప్రతి నీటి బొట్టును ఉత్తర తెలంగాణకు తరలిస్తామన్నారు. రామగుండం బస్‌స్టాండ్‌ అభివృద్ధి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం శ్రీ వెంకటేశ్వర గార్డెన్‌ అండ్‌ ఫంక్షన్‌ హాల్‌లో లబ్దిదారులకు మంత్రులు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయమరణరావు, మేడిపల్లి సత్యం, మక్కాన్‌సింగ్‌, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -