– సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు రంగాలకు కేటాయింపులు చేసినప్పటికీ, వాటి అమలులో స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. వైద్యారోగ్యశాఖకు రూ.13,679 కోట్లు, ఇరిగేషన్‌కు రూ.22,615 కోట్లు, పంచాయతీ రాజ్‌కు రూ.33,688 కోట్లు వంటి భారీ కేటాయింపులు ప్రకటించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఈ నిధులు ఎలా వినియోగిస్తారన్న దానిపై స్పష్టమైన ప్రణాళిక లేదన్నారు.
ఎస్సీలకు రూ.11,784 కోట్లు, ఎస్టీలకు రూ.7,937 కోట్లు, మైనారిటీలకు రూ.3,769 కోట్లు కేటాయించినా, ఈ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. రాజీవ్ యువవికాసం పేరుతో రూ.6,000 కోట్లు కేటాయించినప్పటికీ, నిరుద్యోగ యువతకు స్థిర ఉపాధి అవకాశాలపై స్పష్టత లేదన్నారు. ఐటీకి రూ.875 కోట్లు, పరిశ్రమలకు రూ.3,490 కోట్లు కేటాయించినా, జిల్లా స్థాయిలో ఉద్యోగాల సృష్టిపై ప్రణాళికలు కనిపించడం లేదని పేర్కొన్నారు.
చేనేతకు కేవలం రూ.258 కోట్లు కేటాయించడం దురదృష్టకరమని, ఈ రంగంపై ఆధారపడి ఉన్న కుటుంబాల పరిస్థితి దృష్ట్యా ఇది చాలా తక్కువేనన్నారు. మున్సిపల్, గృహనిర్మాణ రంగాలకు నిధులు కేటాయించినప్పటికీ, కామారెడ్డి పట్టణం, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రత్యేక దృష్టి అవసరమని సూచించారు. మొత్తంగా ఈ బడ్జెట్ సంఖ్యల పరంగా పెద్దదిగా కనిపించినప్పటికీ, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా లేదని విమర్శిస్తూ, కేటాయింపులు కాగితం మీదే కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.



