Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపార్కింగ్‌ కోసం చెరువుల విధ్వంసం

పార్కింగ్‌ కోసం చెరువుల విధ్వంసం

- Advertisement -

పంట నష్టపరిహారంపై పెదవి విప్పని అధికారులు
మేడారం స్థానికుల్లో ఆందోళన

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం చేస్తున్నా మేడారం స్థానికులకు మాత్రం పండుగగా లేని దుస్థితి నెలకొంది. మేడారం జాతర సందర్భంలో రెండో పంటకు నష్టపరిహారం ఇవ్వాలని 2013లో రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినా, ఆ తీర్పును పాలకులు జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతి జాతర సందర్భంలో మేడారం, ఊరట్టం, నార్లపూర్‌ గ్రామపంచాయతీల పరిధిలో వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. దీంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హైకోర్టు తీర్పునిచ్చినా ఈ 12 ఏండ్లలో 6సార్లు మేడారం జాతర జరిగినా పంట నష్టపరిహారం ఇవ్వడానికి అధికారంలో ఉన్న గత, ప్రస్తుత ప్రభుత్వాలకు చేతులు రాలేదు. 1960 నుండి రైతులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు.

రైతుబంధు, నేడు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో పడుతున్నా, నష్టపరిహారం విషయం రైతులు అడిగేసరికి అవి ప్రభుత్వ భూములంటూ అధికారులు కొర్రీలు పెడుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘జాతర విజయవంతం చేసుకుంటారా ? విఫలం చేసుకుంటారా ?’ అంటూ మమ్మల్ని సందిగ్ధావస్థకు నెట్టి అధికారులు ఇష్టమొచ్చినట్లు చేసుకుపోతున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర సందర్భంలో మేడారం గ్రామపంచాయతీ పరిధిలోని మేడారం, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన పంటలు, ఊరట్టం గ్రామం పంచాయతీ పరిధిలో కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో నార్లపూర్‌, పడిగాపూర్‌, ఎల్బాక గ్రామాలకు చెందిన రెండో పంటలను నష్టపోతున్నారు. మేడారం జాతర సందర్భంలో సుమారు 5 వేల ఎకరాలకుపైగా పంటలను స్థానిక రైతులు నష్టపోతున్నారు.

జంపన్నవాగులో ఇసుక కట్టలు
జాతర నేపథ్యంలో జంపన్నవాగులో ఇసుక కట్టలను ఏర్పాటు చేస్తున్నారు. లక్నవరం నుండి వచ్చే నీరంతా ఒకవైపుకు వచ్చేలా ఈ ఇసుక కట్టలను జేసీబీలతో నిర్మిస్తున్నారు. ఈ పనులు ప్రతి జాతరకు జరిగేవే. అయితే జాతర ముగిశాక ఈ ఇసుక కట్టలను అధికారులు తొలగించడం మరిచిపోతున్నారు. దీంతో వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినపుడు వరద నేరుగా కిందికి వెళ్లకుండా ఒకేవైపుకు ప్రవహించి పక్కనున్న పంట, పొలాలు మునిగిపోవడానికి కారణమవుతున్నాయని మేడారం రైతు సిద్దబోయిన లక్ష్మణ్‌ రావు ‘నవతెలంగాణ’కు తెలిపారు. అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదు. ప్లాస్టిక్‌ కవర్లు, చికెన్‌, మటన్‌ వ్యర్ధ్యాలు, భోజన వ్యర్ధాలు ఇష్టమొచ్చినట్టు పడేసిపోవడం, మద్యం సీసాలు పగులకొట్టి పంట, పొలాల్లో వేయడంతో మళ్లీ ఆ భూములను దున్నేటప్పుడు రైతులకు సీసాలు కోసుకుపోయి గాయాలపాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి అలా జరగకుండా అధికారులు చూడాలని కోరుతున్నారు.

జాతరయిపోయాక భూములు బాగు చేయాలి..
జాతర ముగిశాక రైతుల భూములను వ్యవసాయ యోగ్యంగా రూపొందించి ఇచ్చేలా ప్రభుత్వం అధికారులను ఆదేశించాలని రైతులు కోరుతున్నారు. భోజన వ్యర్ధాలు, చికెన్‌, మటన్‌ వ్యర్ధాలతో మేడారంతోపాటు పరిసర గ్రామాల్లో కలుషిత వాతావరణం ఏర్పడుతుందని, దీంతో పాడి కూడా ఇక్కడ ఏం తిన్నా అస్వస్థతకు గురై చనిపోతున్నాయని చెబుతున్నారు. జాతర అనంతరం పారిశుద్ధ్యం పనులు త్వరితగతిన పూర్తి చేసి మెడికల్‌ క్యాంపులతో ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నారు. జాతర అనంతరం కూడా జిల్లా కలెక్టర్‌, అన్ని ప్రభుత్వ శాఖలతో మేడారం పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

భూములను లాక్కుంటున్నారు : లక్ష్మి
మేడారం గ్రామానికి చెందిన సిద్దబోయిన లక్ష్మి మేడారం గద్దెల వెనుక సర్వే నెంబర్‌ 190లో తనకున్న 1.37 ఎకరాలను ఆక్రమించొద్దని ఎంత ప్రయత్నించినా నిలుపుకోలేకపోయింది. అధికారులు సంబంధిత భూ యజమానులకు చెప్పకుండానే భూముల్లో జాతర పనులు చేస్తుండడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సిద్దబోయిన లక్ష్మీ తన భూమిలో ఎలాంటి పనులు చేయొద్దని హైకోర్టునాశ్రయించగా, హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఏటూర్‌నాగారం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌కు అందినా పనులు జరుగుతున్నాయని బాధితురాలు తెలిపింది.

పార్కింగ్‌ కోసం చెరువుల విధ్వంసం
జాతరకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్‌ కోసం చెరువులను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడారం గ్రామంలోని గుండ్లమడుగు చెరువు కట్టను తెంపి చెరువు నీటిని విడుదల చేశారు. చెరువును పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. దీంతో చెరువులోని చేపలు బయటకు వెళ్లిపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో పార్కింగ్‌ స్థలాలను చెరువుల్లోనే ఏర్పాటు చేయడం గమనార్హం. జాతర అనంతరం చెరువులకు కొట్టిన గండ్లను పూడ్చడం, మూసివేసిన కాలువలను తిరిగి ఏర్పాటు చేయడం లేదు. ఈ సారైనా అలా చేస్తారా లేదా అన్నది తెలియదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -