యుద్ధాలు, సాయుధ సంఘర్షణలు అంటే మారణహోమమే. గాయపడిన సైనికులు, పౌర సమాజ అభాగ్యుల హాహాకారాలే. యుద్ధాల్లో ఆస్తుల ధ్వంసం, మౌలిక వసతుల వినాశనం తప్పనిసరి అని మనకు తెలుసు. యుద్ధాలు లేదా సాయుధ సంఘర్షణలు జరిగినపుడు ప్రపంచ మానవాళికి తెలిసేది మరణించిన వారి సంఖ్య, గాయపడిన ఆసుపత్రుల పాలైన ధ్వనుల వివరాలు, కూలిన భవనాలు, దెబ్బతిన్న వసతులు మాత్రమే ప్రచారంలోకి వస్తాయి. నగరాలు నేలమట్టం అవుతాయి. ఈ అపార నష్టాలతో పాటు యుద్ధాల వల్ల పర్యావరణానికి అపార నష్టాలు జరగడం కొనసాగుతున్నాయి. యుద్ధాలు జరిగినపుడు జల, వాయు, నేల కాలుష్యాలు నమోదు అవుతాయి. వ్యవసాయం కుంటుబడుతూ, ఆ ప్రదేశాల్లో ఆహార అభద్రత పెరుగుతుంది. జీవనోపాధులు పలుచబడతాయి. ఆకలి కేకలు పెరుగుతాయి. వలసలతో పర్యావరణ క్షీణత పెరుగుతుంది. అడవులు తరిగిపోతాయి. వన్యప్రాణుల నష్టం జరుగుతుంది.
సహజ వనరులు లేదా గనులు విచ్ఛిన్నం అవుతాయి. చమురు పరిశ్రమలు దెబ్బతింటాయి. కలప, వజ్రాలు, బంగారం, విలువైన ఖనిజాల సంబంధ కార్యకలాపాలు దెబ్బతింటాయి. గత ఆరు దశాబ్దాల్లో జరిగిన నలభై శాతం సంఘర్షణల్లో పర్యావరణం అపార నష్టాలను మూటకట్టుకొని, రేపటి తరం ఆరోగ్యకర జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్న విషయాలను గుర్తించిన ఐరాస జనరల్ అసెంబ్లీ 2001లో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతియేటా 06 నవంబర్ రోజున ”యుద్ధాలు, సాయుధ సంఘర్షణల్లో పర్యావరణ దోపిడీని నివారించే అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్ముడ్ కాన్‌ప్లిక్ట్)” పాటించడం ఆనవాయితీగా మారింది. యుద్ధాల సమయంలో పర్వావరణ వ్యవస్థల సహజత్వాలను కాపాడడం, సహజ వనరుల సుస్థిర నియంత్రణ చేయడం, శాంతి స్థాపన చర్యలు తీసుకోవడం, పర్వావరణ ఆరోగ్య సంరక్షణకు నిధులు కేటాయించడం లాంటి అంశాలను ప్రచారం చేయడం జరుగుతున్నది.
ఈ మహత్తర బాధ్యతలను పౌరసమాజం, ప్రభుత్వాలు, సంస్థలు చేతులు కలిపి పర్వావరణ విధ్వంసం జరుగకుండా అడ్డుకోవాలి. శాంతి, భద్రత, సుస్థిరాభివృద్ధి, మానవాళి శ్రేయస్సును కాపాడడం, చట్టపరమైన రక్షణలు కల్పించడం, ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రపంచ స్థాయి సమన్వయం సాధించడం లాంటివి కొనసాగాలి. యుద్ధాలు జరిగినపుడా బాంబుల మోతలు మోగుతాయి. భూమాత సహజత్వం కాలుషితం అవుతుంది. రసాయన, హెవీ మెటల్ ప్రమాదాలు మీద పడతాయి. అడవుల విధ్వంసం జరుగుతుంది. మట్టి నాణ్యత మంటగలు స్తుంది. నీటి ఎద్దడి వెంటపడుతుంది. పేళని ల్యాండ్ మైన్స్ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
మందుగుండు సామాగ్రి మట్టిని కలుషితం చేస్తుంది. యుద్ధాలతో దీర్ఘకాలిక సమస్యలు మాన వాళిని తరుముతాయి. యుద్ధానంతరం కాలుష్య నివారణ అత్యంత ఖరీదు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్లు, అనగా ఇరవై శాతం జనాభా సంఘర్షణల విషవలయంలో చిక్కి విలవిల్లాడుతున్నారు. జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది. ప్రజారోగ్యం మంటగలుస్తుంది. పర్వావరణ క్షీణత రేపటి బతుకులకు భరోసా పలుచబడుతుంది. ఈ భయానక విషయాలను గుర్తించి పౌర సమాజం, ప్రభుత్వాలు తగు చర్యలను తీసుకుంటూ పర్యావరణాన్ని కాపాడే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యుద్ధాలను అంతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మానవ శ్రేయస్సు కేంద్రంగా మన ప్రతీఅడుగు సన్మార్గం దిశగా పడాలి.
- బి.మధుసూదన్‌రెడ్డి, 9949700037



