కుల, మతాల తేడా లేకుండా స్నేహం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసిన నేల మన భారతదేశం. ఐకమత్యమే మహాబలంగా మెలిగిన ఇక్కడి ప్రజల మధ్య పాలకుల ద్వేషపూరిత ప్రసంగాలు చిచ్చురేపుతున్నాయి. విద్వేషాన్ని విషంలా నింపేస్తూ, దేశాన్ని ఎంతలా నాశనం చేస్తున్నారో చెప్పడానికి ‘ద ఇండియా హేట్ లాబ్ (ఐహెచ్‌ఎల్)’ నివేదిక వెల్లడించిన వాస్తవాలు మన కండ్ల ముందున్నాయి. 2025లో ఈ ధోరణి బాగా ఎక్కువైందని నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది సైతం అంతే విద్వేషాన్ని వెల్లగక్కుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ యువతను రెచ్చగొట్టారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన దేశభద్రతా, దేశంలో శాంతి భద్రతలను కాపాడాల్సింది పోయి…శాంతికి విఘాతం కలిగించే వ్యాఖ్యలు ఈ నివేదికను మరింత బలపరుస్తున్నాయి. ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం లో మూడువేల మంది యువ ప్రతినిధులకు అజిత్ డోవల్ విద్వేషాన్ని నూరిపోశారు. ‘మొఘలులు గతంలో దేవాలయాలను లూటీ చేశారని, ధ్వంసం చేశారని, దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని’ అజిత్ డోవల్ యువతకు పిలుపునిచ్చారు.
అంతే కాదు ‘భారత్ ఎన్నడూ ఇతర దేశాల మీద దాడి చేయలేదని, దేవాలయాలను, ఇతర ప్రార్థానా మందిరాలను ధ్వంసం చేయలేదు’ అని కూడా ఆయన సెలవిచ్చారు. ఇది అర్ధ సత్యం మాత్రమే. కానీ హిందూ దేవాలయాలను హిందూ రాజులే ధ్వంసం చేసిన ఉదంతాలనేకం. 81 ఏండ్ల తన సుదీర్ఘ ప్రస్థానంలో సత్యం తెలుసుకునే అవకాశం ఆయనకు రాకపోవడానికి ఆయనను ఆవహించిన భావజాలమే కారణం. మన ఆలయాలను ధ్వంసం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన అనడం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టే ఆలోచన కాదా? ఆయన మాట్లాడుతున్న ఆలయ విధ్వంసకులు ఇప్పుడు ఎవరూ లేరు. అదంతా వందల ఏండ్ల నాటి చరిత్ర. కానీ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిందెవరు? హిందూత్వం తలకెక్కిన వారు కాదా? ఇది ఇటీవలి చరిత్రే కదా. ఈ వాస్తవం తెలియనంతటి జ్ఞానరాహిత్యం అజిత్ డోవల్ ఉందనుకోలేం. విద్యాధికుడైన డోవల్ వందల ఏండ్ల కింద జరిగిన సంఘటనలకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఈ తరానికి కిర్రెక్కించడం యాదృచ్ఛికం అనుకుంటే పొరపాటే.
ఈ 21వ శతాబ్దంలో మతం పేరుతో ఎక్కడికి పోతున్నాం మనం! దేశం లౌకిక, సౌభ్రాతృత్వ దేశంగా ఉండాలని దేశ రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. దేశ సమగ్రతను కాపాడుకోవాలని, భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న దేశాన్ని లౌకిక విలువలతో నిలుపుకోవాలని, అందుకు ప్రభుత్వా లు పూనుకోవాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇలాంటి నేతల చెవికి ఎప్పుడు ఎక్కుతాయో ఏమో. నిజానికి విశ్వాసాలను, భక్తిని, మతాన్ని ఆసరా చేసుకుని కొందరు ఆధిపత్య రాజకీయ ప్రయో జనాల కోసం వైరుధ్యాలను సృష్టించి, విద్వేషాలకు పాల్పడుతున్నారు. ఇది నేడు మనదేశంలో అత్యంత ప్రమాదస్థాయికి చేరుకున్నదనేది ‘ఐహెచ్‌ఎల్’ నివేదిక తెటతెల్లం చేసింది. 2025లో దేశంలో ముస్లిములు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని 1,318 విద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయి. ఇది 2024 కంటే 13 శాతం అధికమని ఈ నివేదిక పేర్కొన్నది. ముస్లింల తర్వాత క్రైస్తవులు లక్ష్యంగానే ఈ విద్వేష ప్రసంగాలు చేసినట్టు ‘ఐహెచ్‌ఎల్’ వెల్లడించింది. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఘననీయం అని స్పష్టం చేసింది.
నేడు మతోన్మాదం ‘జాతీయవాదం’ ముసుగు తొడిగి కుప్పిగంతులు వేస్తున్నది. ‘ఒక మాంత్రికుడు ద్వేషమనే పిశాచిని సృష్టించి పురిగొలిపితే, అది అన్నిటినీ తినొచ్చి, చివరాఖరుకు తన పుట్టుకకు కారణమైన మాంత్రికుడిని కూడా తిని తృప్తిపడిందట’ అంటారు రచయిత దేవనూరు మహదేవ. సమాజాన్ని పురోగమనం వైపునకు నడిపించే అభ్యుదయ పురోగాములు ముందుకు రావాలి. సైద్ధాంతికంగా, శాస్త్రీయంగా ప్రశ్నించే పరిస్థితులున్న చోటనే కొత్త ఆలోచనలు పుడతాయి. ద్వేషం కాదు..దేశం ముఖ్యం. ఎండిన కడుపులు కాదు… పండిన భూములు ప్రధానం. ఉద్వేగాల భారతం కాదు..ఉద్యోగాల భారతం అవసరం. ఇలా సరికొత్త ఆలోచనలతో యువతను చైతన్యపరచాల్సిన నేతలు అందుకు పూర్తి విరుద్ధంగా విద్వేషపు విషాన్ని కక్కుతున్నారు. జాతీయ భద్రతా సలహాదారు స్థానంలో ఉన్న వ్యక్తి వందల ఏండ్ల నాటి అన్యాయాలకు ఇప్పటి ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలని యువతకు దిశానిర్దేశం చేయడం మొన్న మొన్నటిదాకా కాస్తోకూస్తో దృఢంగా ఉన్న మన లౌకిక పునాదులను పెకలించడమే. పదకొండేండ్లుగా మన పాలకులు వైవిధ్యభరితమైన మన భారతీయతను బలహీన పరుస్తూనే ఉన్నారనడానికి ఈ నివేదిక ఒక ఉదాహరణ. అజిత్ డోభల్ వ్యాఖ్యలు దీనికి కొనసాగింపే. ఈ తరాన్ని అదే విధ్వంసక దారిలో నడవమంటూ పిలుపునివ్వడమంటే కరడుగట్టిన విద్వేష రాజకీయాలను వారిపై రుద్దడమే.
విధ్వంసక దారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



