Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశావర్కర్ల నిర్బంధం

ఆశావర్కర్ల నిర్బంధం

- Advertisement -

చలో హైదరాబాద్‌ను భగం చేసేందుకు పోలీస్టేషన్లకు తరలింపు : వరంగల్‌లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఇంట్లో పోలీసుల దురుసు ప్రవర్తన

నవతెలంగాణ- విలేకరులు
తమకు కనీస వేతనం రూ.18,000 చెల్లించాలంటూ చలో హైదరాబాద్‌ కార్యక్రమం తలపెట్టిన ఆశావర్కర్లను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. ముందుగానే అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. తమ సమస్యలపై మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌.. అధికారంలోకొచ్చి రెండేండ్లు దాటినా పట్టించుకోకుండా.. శాంతియుత ఆందోళనను అణచివే స్తోందని ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంట టోల్‌ ప్లాజా వద్ద ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆశాకార్యకర్తలు రహదారిపై నిలబడి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో ఆశావర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కరీంనగర్‌ పీటీసీ సెంటర్‌కి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆశాలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌, ముత్తారం మండల కేంద్రాల్లో ఆశావర్కర్ల అరెస్టును సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు ఖండించారు. వరంగల్‌లోని ఇంతేజార్‌ గంజ్‌ పోలీస్టేషన్‌ పరిధిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి ఇంట్లో శుక్రవారం రాత్రి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇంట్లో మాధవి లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఇంట్లోకి చొరబడి పోలీసులు పుస్తకాలు, కాగితాలు, వస్తువులను చిందరవందరగా చేశారని సీఐటీయూ నేతలు తెలిపారు. శనివారం ఉదయం ఆమెను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఆ తర్వాత వదిలేశారు. వరంగల్‌ పర్వతగిరిలో ఆశ కార్యకర్తలను, మహబూ బాబాద్‌, గార్ల, డోర్నకల్‌, నర్సింహులపేట మండలాల్లో, పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టులను ఖండిస్తూ అక్కడ ఆశ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆశావర్కర్లను శుక్రవారం రాత్రి నుంచే అక్రమంగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌లో నిర్బంధించడంపై సీపీఐ(ఎం) నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఖండించారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆశావర్కర్లను ఆయన పరామర్శించారు. పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య తోపాటు ఆశావర్కర్లను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ఆశావర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు నాగమణి, భవానితోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -