Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర నిధుల కోసం కార్యాచరణ రూపొందించండి

కేంద్ర నిధుల కోసం కార్యాచరణ రూపొందించండి

- Advertisement -

అధికారులకు సీఎస్‌ ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సీఎస్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సీఎస్‌ఎస్‌ కింద రూ.ఐదు లక్షల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించిందనీ, దీనిలో భాగంగా 15 శాతం జనాభా ఉన్న తెలంగాణాకు కనీసం రూ.25 వేలకోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ కేంద్ర బడ్జెట్‌లో ఫార్మా రంగ అభివృద్ధి, సెమీ కండక్టర్‌ తయారీ, వ్యవసాయ రంగంలో పలు అంశాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారనీ, ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎస్‌ సూచించారు. ఖమ్మం, వరంగల్‌ కరీంనగర్‌ జిల్లాలను కలుపుతూ టెంపుల్‌ కారిడార్‌ అభివృద్ధికి అవకాశం ఉందనీ, దీనిలో భాగంగా వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ కూడా వస్తున్నందున ఈ జిల్లాల్లో టూరిజం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి గణనీయమైన అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రానికి మరో రూ.పది వేల కోట్ల నిధులు రావాల్సి ఉందనీ, ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. 16వ ఆర్థిక కమిషన్‌లో భాగంగా 2011 జనాభా ప్రాతిపదికపై నిధుల మంజూరు ఉంటుందనీ, దీంతోపాటు డెమోగ్రాఫిక్‌ ఏరియా, పథకాల అమలు సామర్థ్యం, నిధుల వినియోగం వంటి ప్రాతిపదికలపై కూడా నిధుల కేటాయింపు ఉంటుందని వివరించారు.

ప్రధానంగా అభివృద్ధి ఆధారిత ఇండికేటర్ల ప్రాతిపదికన నిధుల కేటాయింపునకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సివి ఆనంద్‌, వికాస్‌ రాజ్‌, సంజరు కుమార్‌, జయేష్‌ రంజన్‌, సవ్య సాచి ఘోష్‌, అహ్మద్‌ నదీమ్‌, ముఖ్య కార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, నవీన్‌ మిట్టల్‌, ఎన్‌ శ్రీధర్‌ ఇతర కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -