కార్మికలోకానికి, సామాన్య ప్రజలకు కాదు : ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం
ప్రభుత్వ రంగాన్ని కాపాడితేనే దేశ మనుగడ : కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-అంబర్‌పేట
కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరముందని, అంతే తప్ప వికసిత భారత్, అమృత్ కాల్ అంటూ సామాన్యులను ఇంకా మోసం చేయలేరని ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అన్నారు. వికసిత భారత్, అమృత్ కాల్ అంటే కేవలం అదానీ, అంబానీలకే చెల్లుతుందని పేదలకు కాదని తెలిపారు. ఏఐసీబీఈఎఫ్ ఏపీ, టీఎస్ 37వ మహాసభ, సీబీఐఓయూ ఏపీ, టీఎస్ 13వ త్రైవార్షిక సభలు సంయుక్తంగా హైదరాబాద్ కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాల్‌లో ఎ.సుందర్ రావు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, ఉత్పత్తిరంగాలు, చిన్నతరహా పారిశ్రామిక రంగం కుడా అతలాకుతలం అవుతుందని, అయినప్పటికీ ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేస్తూ సామాన్యులను మభ్య పెడుతున్నదని విమర్శించారు. దేశంలో కార్మికవర్గానికి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, గొంతెత్తితే ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మిక సంఘాలు లేకుండా కేంద్రం అనేక కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బ్యాంకుల్లో రూ.250 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఉందని, అది ప్రభుత్వానిది కాదు, సామాన్య ప్రజలదే అని, ఈ డబ్బును కాపాడే బాధ్యత ప్రభుత్వరంగ బ్యాంక్ ఉద్యోగులదే అని స్పష్టం చేశారు. ప్రయివేటు బ్యాంకులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నా పాలకులు వారిని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్ కె.ధారాసింగ్ నాయక్, ఏఐబీఓఏ ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్ ఖాన్, వరంగల్ రీజినల్ హెడ్ ఏవీ కృష్ణ మోహన్, విజయవాడ రీజియన్ హెడ్ పి.సతీష్ బాబు, ఏపీటీబీఈఎఫ్ అధ్యక్షులు టి.రవీంద్రనాథ్, సంయుక్త ప్రధాన కార్యదర్శి పీవీ కృష్ణారావు, సీబీఐఈఏ – ఏపీ, టీఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి పి.ఉదరు భాస్కర్, వివిధ రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగాన్ని కాపాడితేనే దేశ మనుగడ కూనంనేని సాంబశివరావు
ప్రభుత్వరంగాన్ని కాపాడితేనే దేశం మనుగడ సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బ్యాంకు ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఎర్రజెండా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న స్కామ్‌లను వెలుగులోకి తీసుకురావడంలో మాజీ నేతల పాత్రను గుర్తు చేస్తూ, చట్టసభల్లో ఉద్యోగుల గొంతు వినిపించగల ప్రతినిధులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు ఏఐబీఈఏ పోరాడి ప్రభుత్వ రంగ బ్యాంకులను నిలబెట్టకోగలిగిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో 10 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, ఎఐబీఈఏకు 5 లక్షల సభ్యత్వం ఉండటం గర్వకారణమన్నారు. అనంతరం ఏపీటీబీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకులను నిలబెట్టుకోవాలని, ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏఐబీఈఏ సభ్యులు మరింత సంఘటితంగా పోరాడాలన్నారు.