Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి

విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి

- Advertisement -

చిన్మయ మిషన్‌ అమృత మహోత్సవంలో డిప్యూటీ సీఎం
నవతెలంగాణ-సిటీబ్యూరో

చిన్మయ మిషన్‌ సమాజానికి అందిస్తున్న ఆధ్యాత్మిక, విద్యా సేవలు నేటి కాలానికి ఎంతో అవసరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన చిన్మయ మిషన్‌ 75వ వార్షికోత్సవం (అమృత మహోత్సవం) కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కేవలం కాల పరిమాణం మాత్రమే కాదని, కాలాతీతమైన విలువలతో సమాజ అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న సంస్థగా చిన్మయ మిషన్‌ నిలిచిందని అన్నారు. ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుంచి దూరంగా ఉండటం కాదని, బాధ్యతతో సమాజంలో భాగస్వామిగా నిలవడమేనని గురుదేవ్‌ బోధించారని గుర్తు చేశారు. నేటి కాలంలో సాంకేతిక, భౌతిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, ఒత్తిడి, అసమానతలు, సామాజిక అంతరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చిన్మయ మిషన్‌ వంటి సంస్థల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. బాలవిహార్‌, యువత కార్యక్రమాలు, అధ్యయన వర్గాల ద్వారా చిన్మయ మిషన్‌ విలువలతో కూడిన పౌరులను తయారు చేస్తోందని ప్రశంసించారు. రేపటి వైద్యులు, ఇంజినీర్లు, అధికారులు నైతిక విలువలతో ఎదగడానికి ఇది దోహదపడుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే దృక్పథంతో పాలన సాగిస్తోందని తెలిపారు. ప్రతి పౌరుడు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌ ఎప్పుడూ భిన్న సంస్కృతులు, భాషలు, మతాల మధ్య సమరస్యానికి ప్రతీకగా నిలిచిందని, ఆ సంప్రదాయాన్ని చిన్మయ మిషన్‌ హైదరాబాద్‌ మరింత బలపరుస్తోందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -